పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మ.

జలకం బాడి మిటారి కుచ్చెలలు మించన్ వల్వముల్ గట్టి యిం
పులతోఁ దళ్కుదళుక్కనన్ మెఱయుసొమ్ముల్‌ బూని తావుల్‌ గుబుల్
కొలుపన్‌ గంధముఁ బూసి క్రొవ్విరులు టెక్కుల్‌ నిక్కగాఁ దాల్చి చెం
తలఁ గొల్వందగు వారకాంతలు మహీనాథుం బ్రమోదంబునన్.

133


శా.

రాణింపం జలకంబు దీరిచి యొయారంబై మిటారించు పై
ఠాణీసేలలు గట్టి క్రొవ్విరుల దండల్ చుట్టి భూషాళి వి
న్నాణం బొప్పగఁ బెట్టి కప్పురపుగంధస్ఫూర్తి గన్పట్టి మేల్
జాణల్ గాణలు నైనవారవనితల్ రాజేంద్రుఁ గొల్వందగున్.

134


క.

వెలి దిరిగెడి తొత్తుల వ
క్రుల జోగులఁ గపటజనులఁ గూడి చరించన్
వలదు నృపునంతపురమున
మెలఁగెడువారెల్ల మిగుల మెలఁకువతోడన్.

135


క.

కొనిచను పదార్ధములు వ
చ్చిన పనులుం దెలివిఁబడగఁ జెప్పుచు యత్నం
బనువొందఁగ రాఁ బోవం
జను నంతిపురంబులోని జనముల కెల్లన్.

136


చ.

కనుఁగొనినంత నంటికొనుఁగాన తెవుల్‌గలవారిఁ జూడ కెం
దును నొకపాటి నొప్పులను దూలెడు బంటులఁ జూచి యాదరం
బెనయఁగఁ బ్రోవఁగాఁ దగు మహీతలభర్తకు నెంచ నార్తులౌ
జనములఁ బ్రోచుకంటెను బ్రశస్తతరం బగుధర్మమున్నదే.

137


మ.

తొలుతం దా జలకంబుఁ దీర్చి చలువల్ దోడ్తో విరుల్‌ సొమ్ములుం
గలపం బందుచు దేవియుం జలకమున్ గావించి రాఁ జల్వలుం
గలపంబుల్ మణిభూషలున్ విరులు జోకం దానె యిప్పించి నే
ర్పులఁ గూడందగు రాజు పెం పెసఁగఁ బ్రాపున్‌ సొంపుఁ గల్పించుచున్.

138