పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

తనయింటనుండి జనపతి
తనదేవినివాసమునకు దా నరుగంగా
జనదు మఱి యెంతప్రియుఁడై
తనరిన వనితలను నమ్మఁ దగ దధిపతికిన్.

139


సీ.

భార్యయింటికిఁ జని భద్రసేనుఁడు తొల్లి
           యాపెతోఁబుట్టుచే హతుఁ డగుటయు
నాలిగృహంబున కరిగి కారూశుండు
           తనతనూభవునిచేతనె పొలియుట
ప్రియురాలు విసముతోఁ బేలా లొసంగిన
          వేగంబె కాళికావిభుఁడు పడుట
జడలోన దాఁచుకుండెడుకత్తిఁ దెలియక
          రమణిచేతనె విదూరథుఁడు చెడుట


గీ.

యటుల గరళాంజనముఁ బూసి యద్ద మందె
మేఖలయు నీయఁ జారూప్య మేదినీశు
లవనిపై రూప్యసంవీరు లగు టెఱింగి
యధిపుఁ డతివలయిండ్లకు నరుగరాదు.

140


క.

వనితలచే విసములచే
జనపతి యటు మోసపోక శాత్రవతతులన్
వనితలచే విసములచే
ననిశము దా మోసపుచ్చు టర్హం బెందున్.

141


క.

పరమాప్తజనులచేతనె
నరవరుభార్యలు సురక్షణముఁ జెందుదు దా
దొరకుం గైవసములు గా
దొరకున్ భోగైకయుక్తితో నిహపరముల్.

142