పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


చ.

కలకల ముల్లసిల్ల నల కట్టికవా రిరువంక సందడిన్
దలగ నొనర్చి దూరముగఁ దారు భజింప బలంబుపెంపుసొం
పులు దగ రాజవీథులనె పోవుచు వచ్చుచు నుండఁగాఁ దగున్
జెలఁగి నిజోన్నతుల్ జనులు చెంతలఁ జూడ నృపాలమౌళికిన్.

127


క.

ఇలఱేఁ డుత్సవముల యా
త్రల మూఁకలయందు నేఁగుతఱి సందడు ల
గ్గల మగుచోట్లకుఁ బోరా
చలవున వేగిరము చను టయముగా దెందున్.

128


క.

తలపాఁగలు నరచట్టలు
గలిగిన మరుగుజ్జు లన్నగాండ్రును వేదిం
గొలిచి తిరుగఁగా మెలఁగన్
వలయును జనపతియుఁ దనదు నగరులలోనన్.

129


క.

తల పెఱుఁగుచు శుచిభావము
గలిగిన లోపలియమాత్యగణములు శస్త్రా
గ్నులు మఱి విసములు వెలిగాఁ
గలక్రీడలఁ బ్రొద్దు గడపగాఁ దగుఁ బతికిన్.

130


మ.

తమసన్నాహముచేఁ దనర్చి పనులం దక్షత్వముం జేర్చి యు
త్తము లౌవారలు సమ్మతింప మెలఁగన్ దా నెంతయు న్నేర్చి ని
త్యము నంతఃపురమందుఁ గాదుజనముల్ ధాత్రీపతిం గావ యు
క్తమగున్ లోనినగళ్ళనుండుతఱి నిక్కంబైననెయ్యంబునన్.

131


చ.

ఎనుబదియేండ్లసత్పురుషు లేఁబదియేడులు గల్గునింతు లిం
దును జతనంబు మీఱు మదితోడుత నంతిపురంబులోని కా
మినుల శుచిత్వముం గనుచు మెల్కువ వచ్చుచుఁ బోవుచుండు నా
జనముల దా రెఱుంగఁ దగు పెంచడమున్ నరనాథుపంపునన్.

132