పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సప్తవిధపక్షలక్షణము

వ.

మఱియు మైత్రులును, నిజులును, సంబంధులును, భృత్యులును,
నాశ్రితులును, గృహీతులును, గార్యజులు ననెడు నేడుదెఱంగుల
వార లే పక్షంబనం బరంగుచుండుదు రిట్టి పక్షం బనంగ సహాయు
లనం బరగుచునుండు నిట్టి సహాయు లెట్టివారనిన.

29


సీ.

తన తల్లిదండ్రుల యనుఁగుబంధులె మైత్రు
            లెనసిన ప్రాఁతవారెల్ల నిజులు,
సరవి వియ్యంకులె సంబంధు లగుచుండ్రు
            భృతికిఁ గొల్చెడువారె భృత్యు లరయ
నాత్మరక్షణమున నాశ్రయించినవార
            లాశ్రితు లుపచార మందియుండు
వారు గృహీతులు వసుధఁ గార్యార్ధులై
            యనువొందువారె కార్యజులు దలఁప


గీ.

నిటుల నేడుదెఱఁగులౌ నిట్టివారి
పక్షము లటండ్రు ప్రాజ్ఞులై పరగువార
లిందు రాగాపరాగంబు లెఱుఁగవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.

30


వ.

ఇట్టి సహాయు లనురాగిసహాయులు సద్వృత్తసహాయులు నన
రెండుతెఱంగులై యుండుదు రందు ననురాగంబుగల సహాయు
లెట్టివారనిన.

31

అనురాగిసహాయలక్షణము

క.

అనిశముఁ జేరి కొల్చి సుగుణావళిఁ గీర్తన చేసి నిందలన్
వినక తదర్థమై తనరు విశ్రుతయత్నము పల్కు శౌర్యముం
గని కనుపట్టు దోషములఁ గప్పుచు నుండుట యెందు నెంచఁగా
ననువగు నెయ్యముల్ గలుగునట్టి సహాయునిచిహ్న మిమ్మహిన్.

32