పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

ఫలమున్ వశ్యము దనకుం
గలయది వేఁ జేతి కిచ్చుగతి వేగమె కా
గలయది వ్యయప్రయాసము
గలిగినయదియైన దండు గదలఁగవలయున్.

25


క.

ఏనుఁగులకు గుఱ్ఱములకు
మానుసులకు నొప్పి దాఁకి మఱి ఫలసిద్ధిం
గానక నొగిలెడు బనికిం
దా నెందును దండుపోవఁ దగ దధిపతికిన్.

26

కార్య వ్యసనంబులు

మ.

తనకున్ శక్యముగాని వస్తువులమీఁదన్ యత్నముల్‌ సేయుటల్
దనకున్ శక్యములైన వస్తువులమీఁదన్ యత్నముల్‌ మానుటల్
దనకున్ శక్యములైన వస్తువుల వేళన్ గోరుటల్ మూఁటి నెం
దును గార్యవ్యసనంబు లండ్రు నయవేదుల్ మేదినీమండలిన్.

27


సీ.

ఓర్పును గరుణయు నోర్పు లేకుండుట
            దాక్షిణ్యమును గ్రూరతయు భయమ్ము
డంబును సిగ్గు దుష్టత్వంబు దైన్యంబు
            నతిధార్మికత్వ మహంకృతియును
దనజాతిఁ బుట్టిన జనులఁ గాదనుటయుఁ
            జంపుటయు నుపేక్ష సలుపుటయును
బలువగు నెండకుఁ జలికిఁ దా నోర్వక
            యుండుట వానకు నోర్వలేమి


గీ.

యివియవేళలఁ జేసిన నెందుఁగార్య
సిద్ధులకు నెల్ల విఘ్నముల్ సేయుచుండు
ననుచు నీతిరహస్యజ్ఞు లండ్రు గాన
వీని ననుచితవేళల విడువవలయు.

28