పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

సద్వృత్త సహాయుం డెట్టివాడనిన.

33

సద్వృత్తసహాయలక్షణము

చ.

కులమున మించి మోహమునఁ గూడక దైన్యము లేక విద్యలన్
బలమును సత్యముం గలిగి పాటిలు లోభము డించి బుద్ధిచే
నలరుచు మేలెఱింగి వినయంబు వహించినయట్టిమిత్రుఁడే
వలన నుతించ మంచి తగువర్తన మొందిన పక్షమై తగున్.

34

ఆత్మగుణముల నుద్యోగాదుల శ్రేష్ఠత

గీ.

త్యాగ ముద్యోగమును ధీరతయును బుద్ధి
నిజము మర్యాద సిగ్గు నింద్రియజయంబుఁ
బ్రౌఢియును గారవం బనురాగ మోర్పు
బలము నన ముఖ్యగుణములు పార్థివునకు.

35

శక్తిత్రయస్వరూపము

సీ.

సారమౌ నీతిప్రచారం బెఱుంగుట
           జగతిలోపల మంత్రశక్తియందు
రాత్మసంపదతోడ నలరినబలము కో
           శంబు నెంచఁగఁ బ్రభుశక్తి యండ్రు
ఘనమైనయట్టి విక్రమమును బుద్ధియు
           సత్త్వంబు నుత్సాహశక్తి యండ్రు
నీతిమంతులుగాన నృపవరుం డెల్లచో
           నిట్టి త్రిశక్తుల నెనయవలయు


గీ.

నిటులు శక్తిత్రయంబుచే నెనసి యెపుడు
నేర్పుతోడుత వర్తింప నేరకున్న
మించు శత్రుల నెటుల జయించనేర్చుఁ
జెలఁగి సంపద నేరీతిఁ జెందనేర్చు.

36