పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

తలఁచుకొనుశక్తి ఫ్రౌఢిమ
పలుకులనేర్పులును శాస్త్రపరిచితిఁ గార్య
మ్ములయధ్యాసము నాయుధ
ముల తెలివియుఁ గలుగువాఁడు భువి దూత యగున్.

61

దూతభేదములు

సీ.

కార్య మెంతయు హత్తఁగాఁ జేయఁజాలిన
           యతఁడు నిసృష్టార్థుఁ డనఁగఁ బరగుఁ
జెప్పినట్లే పోయి సేయఁగా నేర్చిన
           యతఁ డరయ మితార్థుఁ డనఁగఁ బరగు
నేమియు నెఱుఁగక యేలినాతనికమ్మ
           లందించ శాసనహారకుండు
జగతిలో నీరీతిఁ దగి మూఁడుదెఱఁగులై
           చరియింతు రీదూతజనులు వరుసఁ


ఆ. వె.

బరజనంబు లిటులఁ బలికినఁ దా నిట్లు
పలుకవలయు ననుచుఁ దలఁచికొనుచుఁ
బోవఁదగినయెడకుఁ బోవఁగా వలయును
క్షితిపవరుననుజ్ఞచేత దూత.

62


క.

అలజడివారల నాటవి
కులఁ దనకున్ లోనుజేసికొనఁదగు మఱియున్
జలముల పెక్కులు త్రోవలు
దెలియఁగఁదగు దనదు సేనఁదెచ్చుట కొఱకై.

63


క.

అరిపురము నతనిసభయుం
జొరవలయుఁ బ్రకాశరీతిఁ జొప్పడ నరిచే
బరికింప ననుమతుండై
యిరవుకొనం జనఁగ నొప్పు నిల దూతలకున్.

64