పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఆ.

శత్రు నతనిరాష్ట్రసారంబు నతని దు
ర్గంబు దుర్గరక్షణంబు మిత్ర
వితతి యతనికినియువేళ భండారంబు
లెస్సఁ దెలియవలయు లీల దూత.

65


చ.

తనవిభుఁ డెట్లు పల్కు మన దా నరితోడుత నట్ల పల్కఁగాఁ
జనుఁ దనమీఁదఁ గైదువలు సాఁచిన నించుక భీతి లేక చూ
పున ముఖచేష్టవల్లఁ దలపోయుచు రాగవిరాగభావముం
గనుఁగొనఁగాఁ దగున్‌ మఱియుఁ గార్య మెఱుంగఁగ దూత చాతురిన్.

66


చ.

తనకు ననిష్టవాక్యములు దాళుకొనన్ జనుఁ గామమున్ మదం
బును మఱి క్రోధము న్విడిచి పోఁ దఱుమం దగు నిద్రవోవగాఁ
జన దొరుతోడఁ గూడుకొని చాలఁబరేంగితముల్ గనుంగొనన్
జనుఁ దనభావ మెయ్యడఁ బ్రచారము సేయఁగ రాదు దూతకున్.

67


గీ.

వైరులందు నమాత్యాదివర్గ మనెడి
ప్రకృతులకుఁ గల్గురాగాపరాగములకుఁ
దెలియఁ దగు మఱి భేదింపవలయు వారి
నరసి భేదింపఁ దగు రహస్యంబు గాఁగ.

68


క.

తనపతిగుణములఁ బ్రకృతులఁ
దను నడిగినఁ బలుకవలదు ధరణీశులతో
దను సర్వము మీ రెఱుఁగరె
యని పల్కఁగ వలయు మంచివగుపల్కులచేన్.

69


క.

కులమునుఁ గడుఁ బేరెన్నిక
గలుగుట ఘనమైనయట్టి కార్యపుసేతల్
కలిమి యన నాల్గుదెఱఁగులఁ
గల వినుతులఁ బతిని రిపుని గణుతింపఁ దగున్.

70