పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

మతిమంతుఁడు సన్మార్గము
గతిచే నద నెఱిఁగి సేయఁగా దగుఁ గార్యం
బతినియతి నెటులనైనన్
క్షితిలోపల మంచిఫలమె చేకొనుచుండున్.

54


మ.

ఇది యీరీతిది దీని కిట్లనుచుఁ దా నెంతే విశుదాత్ముఁడై
యదనన్ దేశమునందు భూపతి సహాయశ్రేణితోఁ గూడి స
మ్మద మొప్పన్ బరిశుద్ధపార్శ్వుఁ డగుచున్ మత్తారివీరావళిం
జదుపంగాఁ దగుఁ గాక చాపలగుణేచ్ఛన్ వర్తిలంజెల్లునే.

55


చ.

అహితములైనఁ గార్యములయందు హితంబును బుద్ధి నేర్చి యీ
మహిపయి మూఢుఁ డౌనతఁడు మంత్రులమాటఁ దిరస్కరించి తా
నహితులమీఁదటం జపలుఁడై కడువేగమె పోయి వారునున్
మహితకరాసులెత్తి పరిమాఱినచోఁ దెలియు న్మనంబునన్.

56


చ.

ఎదిటిబలాబలంబు లొకయింత యెఱుంగక మంచిసాహసం
బొదవ మదించి మించి బలియుండను నేనె యటంచుఁ గొంచమౌ
మదిఁ దమకించుభూపతి సమంచితచంచలవృత్తి శత్రుపైఁ
గదలి దురంబులోనఁ బడుఁగాక సుఖస్థితి నుండ నేర్చునే.

57


మ.

అమితోద్యోగముఁ గల్గినట్టిరిపురాజానీకముం గ్రూరస
ర్పములం బోలె నయప్రవర్తనలచే భాసిల్లుభూపాలకుం
డమర న్మంత్రబలంబుచేఁ దనకు లోనై యుండఁగాఁ జేయు ట
ర్హమగున్ ధారుణి నట్లొనర్చిన న్సపాలాగ్రేసరుండై తగున్.

58


వ.

ఇది మంత్రస్వరూపం బింక దూతచారులప్రకారం బెట్లన్నను.

59


చ.

అనువుగ మంత్రముం దెలిసి యందలి యర్థము లాచరించురా
జనిశము దూతకృత్యములయం దభిమానముఁ గల్గి మంత్రులౌ
జనులకు నెల్ల మంత్రమున సమ్మతుఁడై తగుదూతఁ బంపఁగాఁ
జను సమయంబుఁ ద్రొబ్బుటకు శాత్రవమర్మవిభేదశాలియై.

60