పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంత్రిమండలవృత్తము

సీ.

తొలుదొల్త మంత్రిమండలముతో మంత్ర మూ
            హింపఁగాఁ దగు నభివృద్ధికొఱకు
నది యెట్టు లన్న దేవాచార్యమతము వా
            రఖిలసమ్మతిఁ బదియార్వు రండ్రు
మనువు పన్నిద్ద రైనను జాలు నని పల్కు
            మఱియు శుక్రాచార్యమతమువార
లిరువదియగుసంఖ్య నెంతు రీమంత్రుల
            నితరమతంబువా రెటులనైనఁ


గీ.

గలిగినందఱె చాలు మంత్రు లని యందు
రిటుల మంత్రులసంఖ్యఁ దా నెఱుఁగ నేర్చి
వారిఁ దెలియంగఁదగు వేఱు వేఱ సారె
శాస్త్రమార్గంబు వదలక జనవిభుండు.

50


చ.

హితుఁడయి మంచిపక్షమున నెన్నిక కెక్కుచు నీతిశాస్త్రసం
గతముగఁ గార్యచర్యలఁ దగం జరియించినవాఁడు నాత్మస
మ్మతుఁ డగువాఁడునైన తనమంత్రిశిఖామణి పల్కునట్టి యా
మతమె యొనర్పఁగా నగును మానవనాథున కెట్టివేళలన్.

51


క.

మును మంత్రనిశ్చయంబున
నెనసి నృపుల్ కార్యకాల మెఱిఁగి మెలంగన్
జనుఁ గాలము మీఱినచో
ననువుగఁ గల్పింపవలయు నది మగుడంగన్.

52


క.

అదను మదిఁ గోరుచుం దగు
నద నొక్కొకవేళ దొరకునపుడు దనపనుల్
కొదవ యిడికొనినఁ గ్రమ్మఱ
నద నబ్బుట దుర్లభం బటండ్రు నయజ్ఞుల్.

53