Jump to content

పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

జనపతి తనమంత్రులయా
జ్ఞనె మెలఁగుచు నుండి యెట్టిజనులను దాఁ గా
దనక మఱి యన్నిపలుకులు
వినవలయును మంచిమాట వెదకెడికొఱకై.

32


క.

తనమది మదించి పనియెడఁ
దనమంత్రుల మీఱుపతి వృధామంత్రుఁడు వీ
డని నింద నొందు నతనిని
గనుఁగొని రిపు లాక్రమింపఁ గడఁగుదు రెపుడున్.

33


క.

మంత్రము రక్షింపఁగవలె
మంత్రము మూలంబు మిగుల మనుజేంద్రునకున్
మంత్రము నెడఁ దాఁ జెడుఁ ద
న్మంత్రము రక్షింప రక్షణముఁ గనుఁ దానున్.

34


క.

చతురుఁడయి కాల మెఱుఁగుచు
నతులితగతి సింహవృత్తి నడరెడుధరణీ
పతి కార్యము సేయుతఱిన్
హితులును నది యైన నహితు లెఱుఁగఁగవలయున్.

35


క.

ఫల మెవ్వేళ నొసంగన్
గలుగుచుఁ గడువేగఁ గోర్కి ఘటియింపంగాఁ
గలుగుచుఁ బశ్చాత్తాపము
గలిగించనియట్టిమంత్రిగతి మంచిదగున్.

36

మంత్రాంగములు

ఆ.

దేశకాలగతులు దెలియుట, సాధనో
పాయచింతయును, సహాయవితతి,
నాపదలకుఁ బ్రతిక్రియయుఁ, గార్యసిద్ధియు
నైదు మంత్రమునకు నంగము లగు.

37