మఱియు మంత్రంబునకు జ్ఞానంబును, రక్షణంబునుఁ, బ్రకా
శంబునుఁ బ్రశస్తియు నంగంబులును వ్యాపారంబు నుత్పత్తి
క్రమంబునుఁ బరిశుద్ధియు ఫలసిద్ధియు నావర్తనంబును, ధారణం
బును, మొదలయిన యవస్థాభేదంబులు గల వందు విధుండు
సాక్షాత్కారంబునం దెలియనియర్ధంబు లెల్లం దెలియుట యనెడి
యవిజ్ఞాతవిజ్ఞానంబును దెలిసినయర్ధంబు కక్ష్యాపూర్వకంబుగా
నిర్ణయంబుఁ గావించుట యనెడి విజ్ఞాతనిశ్చయంబును నందు
రెండుకార్యంబులు బ్రసక్తంబులైన నొకటి గాదనుట యనెడి
సందేహభేదనంబును, వెండియు సంధివిగ్రహంబులలోన వృద్ధ
సమ్మతంబున సంధియ మంచిదగుటఁ దెలిసి యదియును భేద
పూర్వకంబైన లెస్సయని తెలిసికొనుట యనెడి శేషదర్శనంబును
నను నిట్టి చతుర్విధభేదంబులుగల జ్ఞానంబు మంత్రులవలననె
సంభవించుం గావున.