పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

పగతులచే దుర్మంత్రుం
డగుదొర చెడు దుష్టమంత్ర మగుయజ్ఞము దై
త్యగణముచే బలెఁ గావున
జగతిన్ సన్మంత్రమునఁ బొసంగఁగవలయున్.

6


చ.

అనిశము ధర్మమార్గములయందె చరించినవారు సిద్ధమై
యొనరినయట్టి కార్యముల నూర్జితులై తగువారు పెద్దలై
తనరినవారు నై నగుణధన్యులు చెందినశాస్త్రమార్గ మెం
దును వదలంగ రాదు నయధుర్యులకున్ నిజకార్యసిద్ధికిన్.

7


క.

జనపతి శాస్త్రముతో నెడ
సినచర్యల వేగిరమునఁ జెంది మెలఁగినన్
దనశత్రునిచే ఖడ్గం
బునకున్ గ్రాసంబు గాకపోవం గలఁడే.

8


క.

బలిమిఁ ద్రిశక్తులలోపల
నల మంత్రము మంత్రశక్తి ననువొందక కే
వలము ప్రభావోత్సాహ
మ్ములఁ గల్గియు శుక్రుఁ డోడె మును గురువునకున్.

9


ఉ.

నీతి యొకింతయుం దెలియనేరని సింగము బల్మిచేతఁ దా
నేతఱియందు నేనుఁగుల నెల్ల వధింపుచు నుండు బుద్ధియున్
నీతియుఁ గల్గినట్టిపతి నేర్పున సింగపుగుంపులం గరి
వ్రాతము నుక్కునం గెలిచి వర్ధిలకున్నె ధరాతలంబునన్.

10


గీ.

మునుపు సామాద్యుపాయముల్ మొనపవలయు
కాల మెఱుఁగుచు వైరిపైఁ గదియవలయుఁ
గాక మఱి కేవలంబు విక్రమముఁ బూని
మెలఁగువాఁ డెందు వగఁ జెంది కలఁగకున్నె.

11