పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రకామందకము

పంచమాశ్వాసము

క.

శ్రీవినుతాలోక జగ
త్పావన రఘురామపాదపంకజయుగళీ
సేవాధురీణ శాంత
ప్రావృత కొండ్రాజువెంకటాద్రి నరేంద్రా.

1


వ.

అవధరింపుము.

2

మంత్రవికల్పప్రకరణము

గీ.

నృపతి షడ్గుణతత్త్వంబు నిశ్చయించి
గూఢ మగుచర్యఁ దగ మంత్రకుశలుఁ డగుచు
మంత్రివర్యులతోఁ గూడి మంత్రరీతు
లమర నూహింపఁదగు రహస్యంబు గాఁగ.

3


క.

తన కాప్తుండై తగుప్రా
జ్ఞునితో మంత్రం బొనర్పఁ జొప్పడుఁ బతికిన్
దన కాప్తుండౌ మూర్ఖునిఁ
దన కాప్తుఁడు గానిప్రాజ్ఞుఁ దా విడువఁదగున్.

4


క.

ధర యెల్ల ననుభవించును
నరనాథుఁడు మంత్ర మెఱిఁగినం గాకున్నన్
బరిభవ మొందు స్వతంత్రతఁ
బరగియు మంత్రంబు నెఱుఁగు ప్రాజ్ఞులచేతన్.

5