పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఆ.

సమయ మెఱిఁగి కృష్ణసర్పంబుగతిఁ జిఱ్ఱు
మనుచు నొడిసి యగ్నియటుల భగ్గు
రనఁగ నెగసి నీతియనుచేత ముందలఁ
బట్టి తివియవలయుఁ బరులసిరుల.

126


చ.

నిలుకడఁ గాంచి మేలెఱుఁగునేర్పు వహించి పరాక్రమంబునన్
గులమున మించి సత్య మొనఁగూడఁగ ధైర్యదయాతిదానస
త్కళల వరించి యూర్జితుఁడు గౌరవశాలియునైనరాజు ని
చ్చలు నిల శత్రురాజుల కసాధ్యుఁ డగున్ మది నెంచి చూడఁగన్.

127


చ.

పరుసముఁ బల్కి మేల్మఱచి బాసలు దప్పి భయంబుఁ జెందుచున్
గరువము దుఃఖ మోపమియుఁ గల్గి ప్రమాదము జాగుచందమున్
విరసముఁ జెంది జూదముల వేఁటల నింతులఁ బానలీలలన్
నిరతము నాచరించు నవినీతుఁడు సంపదఁ జెందనేర్చునే.

128


చ.

గెలువగఁ గోరునట్టి దొర కీడుగుణంబులు గల్గుశత్రుపై
నలవుమెయిం ద్రిశక్తియుతుఁడై చనఁగాఁదగు నట్లుగాక ని
శ్చలగుణశాలియై తనరుశత్రునిమీఁదట నెత్తువాఁడు నే
ర్పులఁ దనుదానె చంపుకొనఁ బూనుచునుండును నింద కర్హుఁడై.

129


చ.

ఘనమగు రాజ్యసంపదలు గైకొను నిచ్చఁజెలంగి బుద్ధిచే
ననువగుమండలక్రియల నన్ని యెఱింగి దృఢప్రయత్నుఁడై
పనివడి విగ్రహస్థితులఁ బాగులఁ జెందుచుఁ గార్యసిద్ధికై
యనిశముఁ బూనఁగావలయు నద్భుతశౌర్యసమగ్రచర్యలన్.

130


వ.

ఇదియు విగ్రహస్వరూపంబు. ఇంక యానప్రకారం బెట్లనిన.

131

యానప్రకరణము

గీ.

అధికబలవిక్రమంబుల నలరి ప్రకృతు
లాత్మగుణముల ననురక్తి నంది కొలువ
విజయ మందుట కలమహీవిభుఁడు రిపుల
నడఁచుటకు దండు వెడలుట యానమండ్రు.

132