పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


చ.

ఒకయిసుమంతయర్థమున నుండెడు లోభముచేఁ బరంబుఁ జెం
దక డిగ నాడఁగావలదు తత్పరలోకవిరుద్ధకర్ములం
బ్రకటము గాఁగ దవ్వులనె పాయుట మేలగు నిట్టు లాగమ
ప్రకరము పల్కుఁ గావున నృపాలుఁడు సత్క్రియఁజేయుటే తగున్.

118


సీ.

బలము పోషణ మంది చెలఁగియుండెడివేళ
            ననురక్తిమై ప్రజల్ దనరువేళఁ
దాను జూచినచూపు దైవ మీడేర్చుచోఁ
            దనమిత్రు లతిభక్తిఁ దనరువేళ
సకలసామంతులు సంధిఁ గోరెడివేళ
            నాప్తమంత్రులు గలయట్టివేళ
ధనధాన్యములు చాలఁ దన కొనఁగూడుచో
            నుత్సాహ మాత్మలో నుబ్బువేళఁ


గీ.

బరుల కిటువంటి వెల్లఁ జొప్పడనియట్టి
వేళ నొనరింపఁగాఁదగు విగ్రహంబు
ధనము మిత్రుండు భూమి నాఁ దగినమూఁడు
గతుల ఫలముల నొకటైనఁ గలుగఁ దెలిసి.

119


ఉ.

మేలు ధనంబు ధాత్రిపయి మించు సువస్తులకన్న నంతకున్
మేలు దలంప మిత్రుఁ డలమిత్రునికంటెను భూమి మేలగున్
మేలగుభూమిచేతఁ గడుమేలగు సంపద గల్గు సంపదన్
జాలఁగ బంధుమిత్రులును సద్గుణజాలము గల్గు నెప్పుడున్.

120


క.

తనతో సమసంపదచే
ననువొందెడిశత్రుజనుల నప్రతిహతమై
తనరునుపాయముచేతనె
జనపతి శిక్షింపవలయుఁ జతురుం డగుచున్.

121