పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గీ.

నొరుల కొఱకైనయదియును దెఱవకొఱకుఁ
గాఁగ వచ్చినయది దీర్ఘకాలముదియు
నైనవిగ్రహముల నెల్ల మానవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.

114


సీ.

బ్రాహ్మణోత్తములతోఁ బరగిన నదియును
          వేళ గాకుండెడివేళ నెందు
దైవబలంబుచేఁ దగువానితోడిది
          కలహంబునకె నిచ్చఁ గాలు ద్రవ్వు
చెలికాండ్రు గల్గిన క్షితిపతితోడిది
          తత్కాలఫలయుక్తిఁ దగుచునుండి
యామీఁద నిష్ఫలమై వచ్చునదియును
          తత్కాలఫలయుక్తిఁ దగులనీక


గీ.

యంతమీఁదట ఫలయుక్తి నమరునదియు
ననఁగఁ దగినట్టి పైపదియాఱుతెఱఁగు
లైనవిగ్రహముల నెల్ల మానవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.

115


గీ.

చేయునప్పుడు మీఁదటఁ జేటులేని
నిగ్రహమ్ములె యెపుడుఁ గావింపవలయు
నవియ కా వన్నిపనులందు నటులఁ గాఁగఁ
దలఁచి మెలఁగంగవలయు నిచ్చలు విభుండు.

116


ఉ.

అప్పుడు మీఁదటన్ ఫలము నందఁగఁ జేయు విశుద్ధకర్మముం
దప్పక యాచరించు జననాథుఁడు నిందలఁ జెందకుండుఁ దా
నెప్పుడు నట్లు కావున మహీస్థలిలో నిహముం బరంబుఁ దాఁ
జొప్పడఁ గూర్చునట్టిపని సొంపునఁ జేయఁగ నొప్పుఁ బ్రాజ్ఞుఁడై.

117