పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గీ.

యల మనుష్యముఖాంతరమందునైనఁ
గట్టి కొట్టుచుఁ గాఁకలం బెట్టునెడల
నది సువర్ణంబులీలచేఁ జెదరకుండుఁ
గనుక కాంచనసంధి నా వినుతిఁ గాంచు.

66


సీ.

మంచికార్యము నిద్ద ఱెంచి సేయుటకునై
           యడరుట యది యుపన్యాససంధి
యితనికి నుపకార మే నొనర్చితి మున్ను
           నతఁడు నా కుపకార మటులఁ జేయు
నుపకార మిపుడు నే నొనరించుచున్నాఁడ
           నిఁకమీఁద నా కుపకృతి యొనర్ప
గలఁ డీత డని రాముఁ డెలమి సుగ్రీవున
           కొనరించినట్లుగా నొప్పు నిదియు


గీ.

ననెడు నదియును బ్రతికార మనెడిసంధి
యిరువు రొకయాత్రఁ గూర్చి తా రింపు మీఱ
సంధి సేయుట సంయోగసంధి యనఁగఁ
పరగు నీరీతు లెఱుఁగ భూపతికిఁ దగును.

67


సీ.

మనయిరువుర యోధలును గూడి మాకార్య
            మిది యొనగూర్చిన నింత ధనము
మీ కిత్తుమని తాను మేకొన్నసంధి తా
            నది పురుషాంతర మనెడుసంధి
మాకార్య మిది మీర చేకూర్చినను మీకు
            నిట్టివస్తువులు మే మిత్తు మనిన
నది యదృష్టపురుషమనఁ దనరెడు సంధి
            దేశాంశ మియ్య నాదిష్టసంధి