పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

తనవారినిఁ బెఱవారినిఁ
దనవారినె చేసికొనఁగఁ దగు జనపతి యెం
దును దా బహుమిత్రుం డై
నను వైరులు సెప్పినట్లు నడతురు పుడమిన్.

59


క.

తన కాపద యగువేళను
దనమిత్రుండైన కరణిఁ దన బంధువులుం
దనతండ్రియుఁ దనయన్నలు
దనతమ్ములు హితముఁ జేయఁ దా రోపుదురే.

60


క.

క్షితిలోపల నతులదృఢ
వ్రతులై తగుతనదుమిత్రవర్గముచేతన్
బ్రతివీరు లైనవారలఁ
జతురతమై నిగ్రహింప జనపతి కొనరున్.

61


మ.

ఇల నీరీతుల నీతిమార్గమునఁ దా నేప్రొద్దు వర్తించి ని
శ్చలితోద్యోగమునన్ జయేచ్ఛ గలరాజన్యుండు పెంపొందు మం
డలశుద్ధిం దగి శుద్ధమండలమునన్ వర్తించు నాశారదో
జ్జ్వలచంద్రుం డన భూప్రజావితతికిన్ సంతోషముం జేయుచున్.

62


వ.

ఇది మండలశోధన ప్రకారంబు. ఇంక సంధ్యాది షడ్గుణంబుల
స్వరూపంబుఁ గ్రమంబున వివరించెద.

63

సంధివికల్పప్రకరణము

క.

బలియుఁ దగువైరి గదిమిన
బలువగునాపదలఁ జెంది ప్రతి సేయఁగ నే
ర్పులు లేనిరాజు కాలం
బలవడఁ గడపుచును సంధి యమరించఁ దగున్.

64