పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

మిగుల నుపకారియైనను
బగవానిన్ మిత్రుఁగాఁగఁ బాటింపఁ దగున్
మిగుల నపకారియైనను
దగుఁ జుట్టమునైన విడువఁ దగు జనపతికిన్.

47


క.

తనయెడఁ దనశత్రునియెడ
ననిశంబును బక్షపాతియై మెలఁగెడు మి
త్రునిఁ గూల్పవలయు నింద్రుఁడు
కినుకన్ మును విశ్వరూపుఁ గెడపిన మాడ్కిన్.

48


గీ.

అహితునకు హిత మొనరించునట్టి మిత్రు
నైన విడువంగఁ దగుఁ దనయహితుమాడ్కి
హితుల పట్టున నెవ్వాఁడు హితము సేయు
వాఁడె పో మంచిమిత్రుఁ డివ్వసుధలోన.

49


క.

అనురక్తుండు విరక్తుఁడు
ననవల దుపకారకారి యగుమిత్రునిఁ దా
ననువుగఁ దెలియుచు దోషం
బునఁ జెందినమిత్రు విడువ భూపతి కొనరున్.

50


క.

కడుదొసఁ గొందని మిత్రుని
విడిచినచో నర్థధర్మవితతియు నడఁగున్
బుడమిం గావునఁ బతి యె
ప్పుడు సద్గుణములను దోషములఁ దెలియఁ దగున్.

51


క.

తానె నిజంబుగ నేరమిఁ
గానక మఱియాజ్ఞ సేయఁగాఁ దగ దేరిం
దానే నేరమిఁ దెలిసిన
చో నుచితపుటాజ్ఞచేతఁ జొప్పడుఁ బతికిన్.

52