పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఆ.

నుభయమిత్రుచేత నొగి మిత్రమిత్రుచే
శత్రుమిత్రమిత్రుఁ జదువవలయు
నిటుల నహితవరుల నిరుగడ గదుముచు
గెలువవలయు నల జిగీషువునకు.

23


క.

ఈరీతి రెండుగడలన్
నేరుపుతో గెలువఁగోరు నృపతి గదిమనన్
వైరులు మెత్తురు లేదా
వారు దనుం గొలిచి నిలిచి వర్తింతు రిలన్.

24


చ.

తనకును వైరికిన్ సమతఁ దాల్చిన చుట్టపువంక బారి నే
యనువుననైనఁ గూర్చుకొని యందఱినిం దనవారిఁ జేసికోఁ
జను నటులైన చుట్టములె చాల నలంచినయట్టిశత్రునిన్
జనపతి దా జయించుటకుఁ జాలఁగ శక్తుఁ డగున్ సుఖస్థితిన్.

25


ఆ.

కారణములచేతఁ గాదె లోకులు శత్రు
లగుచు నున్కి మిత్రు లగుచు నున్కి
నటులు గాన శత్రు లయ్యెడికారణం
బులను విడువవలయుఁ బుడమిఱేఁడు.

26


క.

దొర తాఁ బ్రధాన మగుచున్
ధరఁ గలిగిన ప్రజలనెల్లఁ దనవారలుగా
బరగింపందగు నటువలెఁ
బరగిన సర్వాంగరాజ్యపదవిం జెందున్.

27


ఉ.

దూరమునందె యుండి పరదుర్గనివాసుల మండలేశులన్
గూరిమిఁ జూపి మిత్రులుగఁ గూర్చుకొనందగు న ట్లొనర్చినన్
వారలు ప్రాణబంధువులు వశ్యులునై వినయంబు పెంపునన్
దారె యొనర్పుచుండుదురు తక్కినమండలముల్ వశంబుగన్.

28