పుట:అహల్యాసంక్రందనము.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఒక కొమ్మనే రెండుపూవులు పూసినప్పుడు, ఆకారవిశేషాల్లో, అందచందాల్లో గోరువాసి ఒకదానికొకటి తీసిపోయినా, పరిమళం హాయి చిమ్మేస్వారస్యం రెంటికీ సమానంగానే అలవడి ఉండటం సాధారణంగా సహజం. చుక్కల మినుకు మినుకుల్లో అంతదూరాన్న ఎక్కువతక్కువ లెవరెంచుతారు, వెలుగుకు ముచ్చటపడటమే కాని!

అటు తంజావూరులో, సర్వజ్ఞుడు, సకలకలారసికుడు, రఘునాథరాయలు: ఇటు మధురలో వరాంగనా అనంగసర్వస్వమూర్తి రసికరాజు తిరుమలేందుడు. రెండురాజ్యాలూ ఒకదానికొకటి క్షాత్రమర్యాదలలో, వైరాలలో, పంతాలు సాధించుకుంటూన్నా, సారస్వతంలో జోడుపంచకల్యాణుల బారుగా హెచ్చుతగ్గుకాని కదను చూపించినవి. కన్నడసామ్రాజ్యవైభవాలలో వారసత్వంగా చిక్కించుకున్న కావ్యవినోదపారవశ్యం, దక్షిణదేశాన, హోయసల సామంతులకు జన్మహక్కు అయిపోయి, తరతరాలుగా, తామరతంపరగా ఫలించినది.

ఇద్దరు రాజులూ, తమపేరు నిలువబెట్టి తమ అంతవారయే సంతతి కలుగుతూండవలెనని, కోరుకోవడం ఉచితమేకదా: రఘునాధరాయలవైభవం విజయరాఘవునిలో కోటికి తీరి కొండయెక్కింది. తిరుమలేంద్రుని మనుమడు[1] రాజ్యమునకు వచ్చిన తరువాతగాని, మళ్లీ తొలికాలవువెలుగు జ్యోతిగా మెరయలేదు.

పితామహి మంగమ్మదేవి గారాబాలు చెల్లే పెంపకంలో, తిరుమలేంద్రుని మించగలవు అనే పెద్దల ఆశీర్వాదబలంతో చొక్కానాథుడు యుక్తవయసున రాజ్యానికి వచ్చి, ఆహోదా నిలువబెట్టగలిగాడు. సమ

  1. కురుగంటి సీతారామయ్యగారు తమగ్రంథాన, మధురరాజులవంశావళి యిస్తూ, తిరుమలుని కొమారుడు, ముద్దువీరప్ప, అతని కుమారుడు చొక్కనాథుడు అన్నారు. సత్యనాథ అయ్యర్ గారి ఆంగ్ల మధురనాయకచరిత్రములోనూ ఇలాగే ఉన్నది. మఱి రామయ్యపంతులుగారు మనుమడి మనుమడని రెట్టించారు. ఎందువల్ల?