పుట:అహల్యాసంక్రందనము.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విడిచి, నీవు ఉనికి కాజేసుకున్నందువల్ల ప్రణయపుణ్యభూమి అయిపోయిన ధూసరక్షేత్రానికి, ఫలకేదారాలను విడిచిరాని వసంతుని తర్లించుకునివచ్చి, అడవితీవెల పెనయల్లికలుగా, నిన్ను కౌగిలింతలతో సమాశ్వసించలేదా? ధరిత్రీదేవి, రంగురంగుల కీటకాల అలలు రేపి, భ్రమరగానాలు సన్నివేశరోదసిని మూర్ఛనల తేల్చేవిధానం కలిపించి, ఆశ్రమప్రశాంతికి, ప్ర్రణయాస్థానవిలాసములు అలవరచి నీవంటరితనంలో, మధురభావనలు తీయతేనియల ధారలుగా ఊరించలేదా? అంధకారము, జడశాంతి — నీరాగహృదయంలో ప్రణయంనాటిన వెలుగుతీవలు ననలుసాగడానికి, విరులై కోరికలు సుప్రసన్నంగా విరియడానికి, కామపాలికలు, అర్ధవంతంగా, నిలిపిన రక్షలు.

కాని, ఆవెలుగులు మళ్లా వెలుగులో కాని విప్పారవా? అందుకోసమేనా, ప్రణయపరిపూతమై చంద్రకాంతస్వచ్ఛమైన, నీమూర్తిలో, జీవనవిద్యుత్ప్రభలు నింపుకోవాలని, ఆమహామహుడి స్పర్శకు కాచుకుని, అలికిడికి తలఒగ్గి, యుగాలుగా, రవంత అయినా చలించని ఉత్సాహంతో, ఉండటం? పాపము అని అనరాదు, ఎందుకనీ, అదే నీ కలుషాన్ని అంతా కడిగివేసింది. శాపము. నీకు నూతనశుభ్రజీవనానికి అవకాశం కలిగించింది.

నవనవోదయవిలాసవిభ్రమాలు, నీపునరుజ్జీవితమూర్తిలో, వెలుగులుగా మెరసినా, వాటి తారళ్యాన్ని, చమకితం చేయడానికి అని అయినా, ఆ అంతులేదనుకున్న చీకటి కనుకొలకులనుండి జారిన మంచుబిందువుల బరువులు, నీ కనురెప్పలు నీలోత్పలదళాలుగా మ్రోయక తప్పదు. నీ కైశ్యము, దీర్ఘవర్షాశైవాలపుంజాలకు మెరుగులు పెడుతూండక తీరదు.

నీవు చీకటులు తెమల్చుకుని వెలుగులో తలఎ త్తడంలో- నీప్ర్రబుద్ధ మార్తిలో, అతిప్ర్రాక్తనత, నవనవీనత, చిత్రరీతిలో మిళితమైపోయినవి. విరిసీ విరియని, విరికన్నెలాగా తరుణివి అవుతావు: నగరాణి లాగా, అనాదివై ఉంటావు.