పుట:అహల్యాసంక్రందనము.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీవు జాణవుకావా? ప్రియులను గికురించే ప్రోడతనపు జాడలు ఎరుగని ముద్దరాలవా? శిలవై, బాహ్యసంచారప్రవృత్తులు అరికట్టుకున్నా, అంతర్వాహినిగా గమకించే జీవనకల్లోలినీసీకరరహస్సేచనములతో దోహదాలు దిద్ది, ఆచలువలతో, లతాళీ – ఆళీజనాన్ని వెలయించుకుని, వాని వికసనహాసాలతో, పురాతనప్రియుడైన సూర్యుడికి, వెనుకటి శృంగారగాథలు పుల్కరింతలు జేసి, నీవు ఆ చోద్యానికి మురిసిపోవడం నేర్చుకోలేదా?

పాతివ్రత్యపు వలలో, లోకమోహిని వైన నీ అలవికి మించిన అందాలని ఒడిసివేసి, ఇతరులు తేరిచూడకుండా, చీకటిపాతరలలో నిక్షేపంలాగా పదిలపరచుకున్న గౌతముని స్వార్ధతపస్సమాధికి ఋజుధిక్కారమేనమ్మా - నీ నవపల్లవహృదయం ఇనగరామోదాన తహతహతో కోరకించడం: యామినికి వశంగతుడై, నీకు ఆలోకనభాగ్యం అస్తమింపజేసుకునే దినరాజు త్రపాఅరుణమైన ముఖబింబం శోణ-పాండిమాభాసంతో, విప్రలంభ-దైన్యం నిట్టూర్పుగా, లయ కలిపించుకుంటుందమ్మా. ఫలరూపానికి తెచ్చుకోలేని, ప్రణయకాంక్షలు, తారకాసంతానాన్ని నీకు ప్రదర్శించి, నీమాతృహృదయాన్ని ఒరుసుకుపోయి చీకటితెరలమీద వెలుగులజాలరులు అల్లి, అరుణోదయందాకా, నిన్ను ఎంత అలయించుతా యమ్మా.

మానవలోకానికి హితోపదేశంగా అల్లుకుని పోయినా, నీప్రణయం దేవరహస్యమన్నమాట నీమనసు ఒకటే ఎరుగునేమో? చీకటిలోనే కాదూ, మునిపాదపరిచర్యలతో నవసిపోయిన నీకోమలాంగుళులు, సౌందర్యమూర్తి సంస్పర్శనకు నోచుకున్నవి. తిమిరావకుంఠనం మరుగుననేకాదూ, నీమనసునిండిన ప్ర్రణయం నీవు కోరినతీరుల్లో పండింది! నీవు చేసింది చీకటితప్పుకాదు: అంతవరకూ, నీకన్నెతనాన్ని ఆశ్రమప్ర్రాంతాలలో వెన్నెలగా కాయించిన, ఆతప్పు- చీకటిది.

నీది తప్పిదమని ఎవరు ఆగ్రహించారు? మాధవునికే స్వీయలైన వనదేవతలు, ప్రణయానికి ఆహుతి అయిపోయిన, నీధీరతనానికి కుసుమాంజలులుగా, వర్ణమయములైన వనసీమలను