పుట:అహల్యాసంక్రందనము.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వరకూ సారస్వతంలో, ఎవరి నిర్వాహకత్వం వలనైతేనేమి, సంక్రమించి ఉంటూన్న ప్రతిష్టయావత్తూ మాసిపోయి, గ్రంథచౌర్యం చేసిన నీచురాలు అని అనవలసి వస్తుంది. ఎందుచేతనంటే, పద్యాలన్నీ ఒకటే. ఉన్నంతవరకూ సంభోగవర్ణన, అహల్యాసంక్రందనంలో ఉన్నవచనమే! కథలో, ఉపనాయిక, ఇక్కడ సత్యభామ - ఈ రవంత భేదమే తప్ప.

కాని, ముద్దుపళనికి, ఈ అపవాదు తొలగించేందుకు, సదుపాయములు, కనబడుతూన్నవి. ఏమనంటే,

సముఖ వేంకటకృష్ణప్పనాయకుడు, రాధికాసాంత్వనము ఏకాశ్వాసప్రబంధముగా నిర్మించాడు అనేందుకు, ఇతరగ్రంథాలలో కాని, అతడు రచించిన గ్రంథాలలోనైనాకాని, ఎక్కడా ఆప్రశంస కనబడదు.

ముద్దుపళనికావ్యం ద్వితీయాశ్వాసంలోనుంచి మొదలుకొని కొన్నిపద్యాలు ఏరి, చివర అహల్యాసంక్రందనము వచనమూ, ఆశ్వాసాంతగద్యమూ, కలిపి, ఇళ అన్నచోట సత్యభామ అనిమార్చి, కలగాపులగంగా, ఎవరో చిలిపితనానికి, వేంకటకృష్ణప్పనాయకుడికి ఈ అనవసరఖ్యాతీ, ముద్దుపళనికి అపఖ్యాతి కలిగించడానికి చేసినపని అనిపిస్తుందే కాని, రెండుకావ్యాలూ పరిశీలనగా చదివితే, ఒకరు సంగ్రహంగా కూర్చినదానికే మరొకరు వెనుకాముందూ అదుకులు వేసి, గ్రంథమంతా కేవల స్వకపోలకల్పితమనే ప్రతిష్ట కలిగించుకునేందుకు ప్రయత్నించారు అని సూచనగా అయినా కనబడకపోవడమే కాకుండా, స్పష్టంగా, ఈవిషయంలో ముద్దుపళనికి అన్యాయం జరిగిందని తెలుస్తుంది. జయంతి రామయ్యపంతులుగారు ప్రకటించిన జైమినిభారతభూమికలో రాధికాసాంత్వనము వేంకటకృష్ణప్పనాయకుని కృతి అని వ్రాయబడినది. నిడదవోలు వెంకటరావుగారు, సత్యభామాసాంత్వనం భూమికలో, ఆలాగే అన్నారు. కాని ఎవరున్నూ అలా అనడానికి కారణములు ఏమి ఉన్నవో చెప్పారు కారు.

ఇలా సందేహాస్పదంగా ఉన్నా, రాధికాసాంత్వనమును ప్రస్తుతం ఈసంపుటంలో ప్రకాశకులు చేర్చడం, ముద్దుపళని కవిత్వం తీయదనంతో