పుట:అహల్యాసంక్రందనము.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముగించాడు. ఇలా చేయడం ఉచితమౌనా? అహల్య అనుభవించిన తీయందనము, చివరకు అనుభవించిన బాధ మీదుగా చూస్తేనేకాని, సంపూర్ణముగా అవగతముకాదే! హృదయం వెన్నెలలో పండించుకునేందుకు, కామభోగిని, చేయగల త్యాగం, లజ్జావతి అయిన కులపాలిక చూపించగల నిర్లక్ష్యం, సహించగల యాతన, అప్పుడు కాని ఆనందానికి విలువ కట్టేందుకు వీలుపడదే! హర్షపండితుడు నలుని కథ త్రుంచివేశాడంటే, అక్కడ సబబున్నది. ఆపోలిక యిక్కడ పనికిరాదు.

వేంకటకృష్ణప్పనాయకుని ప్రబంధము ఏవిధమైన అనౌచిత్యానికిన్నీ యెడమీయదు. పాఠమా, ముదిరి కటువు పడదు. శృంగారమా, సభ్యతను ముంచివేసి ఉచ్ఛృంఖలముగా అతివేలముకాదు: కల్పనలా, బింకము తప్పవు సర్వమధురమైన సద్గ్రంథము.

రాధికాసాంత్వనము

ముద్దుపళని, 650 పద్యాలతో, రాధామాధవవిలాసాన్ని కథగా తీసుకుని ప్రబంధముగా రచించినది. ప్రతాపసింహుని ఉంపుడుకత్తె అయిన ఈమె రచన, తంజావూరు సారస్వతములో చివరగ్రంథము - అని బ్రౌను పండితుడి అభిప్రాయం. ప్రస్తుతం దొరుకుతూన్న ఏపతిలోగాని 605 కు మించి పద్యము లుండకపోవడం వల్ల అంకెలు తారుమారుగా పడినవేమో అని సమాధానము చెప్పుకోవచ్చును. తంజావూరు నాయకరాజుల చల్లని యేలుబడిలో వెలసిన కావ్యగ్రంథాలలో నిదే చివరదౌనో కాదో, రూఢిగా నిశ్చయించడానికి ఆధారములు లేవు.

ముద్దుపళని, స్వతంత్రముగానే గ్రంథము రచియించినది, అని యింతవరకున్నూ ప్రసిద్ధిఉన్నది. ఆమెవలలో చిక్కిన రాజగురువు వీర రాఘవాచార్యుడు, గ్రంథరచనలో, అంతో యింతో సాహాయ్యము చేయకుండా ఉండడని, అసలు ఆతడే రచియించి, ఆ వలపుగత్తెపేర వెలయించి ఉండటానికి కూడా వీలున్నదనీ, ఇలా, నిందెలు తప్పకుండా వస్తూన్నవి. వానికి తోడు, ఇప్పుడు వేంకటకృష్ణప్పనాయకుడు ఈ రాధికాసాంత్వనము రచించాడని అంగీకరించేటట్లయితే, ముద్దుపళనికి ఇంత