పుట:అహల్యాసంక్రందనము.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వలసినది. చక్కనికావ్యము, అంతకన్న చక్కనినాటకము తయారుచేయడానికి ఎన్నోవీళ్లు ఉన్నవి. అహల్య మనోగతిని, ప్రవృత్తులను వ్యాఖ్యానించి, పాప. కళంక మంటని రసమూర్తినిగా చిత్రించవలనవుతుంది.

జైనభిక్షువు ఎవడో రచించినటుల ప్రచారంలో ఉన్న ధూర్తాఖ్యాన మనే నిబంధనంలో, ఇంద్రుడు గౌతమశాపంవల్ల శరీరమంతా స్త్రీ చిహ్నలు కలిగి, తిరిగి దేవలోకానికి పోవడానికి సిగ్గుపడి ఆశ్రమప్రాంతాన తచ్చాడుతూండగా, బ్రహ్మచారులు అవి చూసి చెడిపోతూండటం మూలాన, బలవంతాన అక్కడనుంచి అతన్ని తరిమివేశారని ఒకవిచిత్ర కల్పన ఉన్నది.

ఇలా చమత్కారాలు, ఉంటూంటవి వాని కేమి గాని, అహల్య రాయిగా మారిపోయిందా, లేక రాయి అయిపోయిందా, అనేవిషయం విచారించతగినది. రామాయణంలో, మారిపోయినట్లుగా లేదు. గిరీశబాబు తననాటకంలోనూ, ఆలాగే తీసుకొన్నాడు. నవనవోల్లాసాలతో, ఎప్పుడూ విరిపూతలతో మాతృప్రేమ మరందధార లవుతూండవలసిన మనసు, మోడై పోయింది, గుండె రాయై పోయింది, అని పద్మపురాణంలో — 'సా తతస్తస్య రామస్యపాదస్పర్శాన్మహాత్మనః, అభూత్స్వరూపా వనితా సమాకాంతా మహాశిలా' అని రాయి అయిపోయినట్టుగా ఉన్నప్పటికినీ, లక్షణార్థాన్నే తీసుకోవడం ఉచితం,

వాల్మీకి, ఇంద్రు డహల్యను అంటుపరచినది ఒకమారేనని ముక్తసరిగా వదలిపెట్టేశాడు: శతానందుడు గౌతముని ఔరసుడని రామాయణోక్తం.

అహల్య యిన్ని చీకటితప్పులూ బుద్ధిపూర్వకంగా చేసిందా? అలా అని ఘట్టిగా అనడానికి వీలున్నదా? ఒకటి రెండుసార్లు ఓపికపట్టి ఊరుకుని, చివరకు, అంతకుముందల్లా లేనిది అప్పుడే ఏదో మహాముంచుకువచ్చినట్టు శాపాయుధం ఝళిపించిన గౌతముని చేతకు నసి అయిన అర్థం ఉన్నదా?