పుట:అహల్యాసంక్రందనము.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

85

     ద్దంతురదంతిపన్నగముఁ దాపసబంధితవల్కశాటికా
     త్యంతవిలాసభృన్నగమునౌ హిమవన్నగ [1]మొందె నయ్యెడన్.130
వ. అంతఁ గొంతకాలంబునకు, నిక్ష్వాకువంశపయఃపారావారరాకా
చంద్రుండగు దశరథమహారాజేంద్రునకు, దేదీప్యమానమార్తాండమండల
సమధాముండును, వైరీకాంతారప్రళయకాలదావానలప్రభాసముద్దాముం
డును, అనంతకళ్యాణగుణాభిరాముండును నై శ్రీరాముండు విష్ణుమూర్తి
పూర్ణావతారంబున జనియించి, దినదినప్రవర్ధమానుండై యుండు నవసరం
బునఁ దనుప్రభావిజితమిత్రుండగు విశ్వామిత్రుండు చనుదెంచి, దశరథాను
మతంబున, విమతఖండనశౌండభుజదండసంపాదితకీర్తిసాంద్రుండైన
శ్రీరామచంద్రుని సకలాఘౌఘనివారణసుముఖంబగు మఖంబుఁ గాచుటకై
తోడ్కొనిపోవ, నమ్మహావీరుండు, సింహశరభశార్దూలప్రముఖనానావిధ
మృగయూధశరణ్యంబగు నరణ్యంబుఁ బ్రవేశించి, బహువిధకామరూప
నిరాఘాటసంచారితశృంగాటక యగు తాటకిన్ వధియించి, నీచులగు
సుబాహుమారీచుల నుక్కడంగించి, యమ్మౌనియాగంబుఁ గాచి నిరంతర
ప్రబోధధానియగు జనకరాజ రాజధానింగుఱించి వచ్చునప్పుడు, పురోభాగం
బున విజ్ఞానసూర్యప్రభాసరస్తతముని గౌతముని యాశ్రమంబుఁ గనుంగొని.131
చ. 'మునివర, యేమి యీవనము ముచ్చటగాఁ దగియుండియున్ వృథా
     జనకులహీనమై యిరిణసన్నిభమై కనుపట్టె నేమకో
     వినియెద' నంచు వేఁడు రఘువీరునికిన్ గుశికాత్మజుండు ప
     ల్కెను మది సంతసం బలర లిలఁ దదాశ్రమవర్తమానముల్.132
ఉ. 'భూతలమందు మౌనికులముఖ్యుఁడు గౌతముఁ డంచనన్ దపః
     ఖ్యాతిని దీటు లేదన జగత్త్రయమందుఁ బ్రసిద్ధినందు న
     య్యాతనియాశ్రమం బిది మహాశ్రమవారణకారణంబు రా
     చూతువుకాని యందు నొకచోద్యము హృద్య' మటంచుఁ బల్కుచున్.133

  1. మొందెఁ బొందుఁగన్