పుట:అహల్యాసంక్రందనము.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

అహల్యాసంక్రందనము

క. ఆరాముని గౌతమముని
     యారామస్థానవాటికై పిల్చు చహ
     ల్యారామశాపహృతిపై
     యారామగతిన్ మునీంద్రుఁ చ్చటి కేఁగెన్.134
క. అందందుఁ జూచుకొనుచును
     ముందఱ రఘురాముఁ డపుడు పోవుచునుండన్
     కెందమ్మిఁ బోలుపాదము
     లందలి రేణువులు ఱాతి నందినయంతన్.[1]135
మ. మృదువై మెల్లన కొంతసేపటికి సద్వృత్తంబుగా నౌచుఁ బెం
     పొదవన్ గొంత కరంగి సోఁగయగుచున్ బొల్పొంది యారాయి చ
     క్కదనం బేర్పడి మోహనాకృతి చెలంగఁ యౌవనశ్రీ తగన్
     సుదతీరత్నముగాఁగ నిల్చెను మదిన్ జోద్యంబు వాటిల్లఁగన్.136
చ. వినయముగాను మౌనియలివేణియుదారపదారవిందముల్
     కనుఁగొనుచుఁ రఘూద్వహుఁడు గ్రక్కునఁ దాను నమస్కరించె నా
     వనిత యొసంగు దీవనలవల్లను నుల్లము పల్లవింపఁగా
     మునిమునిమీసముల్ కులుకు మోమున నవ్వు దొలంకుచుండఁగన్.137
క. ఆతఱి గనుఁగొని బిరబిర
     గౌతమముని యేఁగుదెంచి గౌరవ మొప్పన్
     నాతిసమీపముఁ జేరిన
     యాతనిఁ గని రామచంద్రుఁ డానందమునన్.138

  1. చెన్నపుర ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారమునఁగల D 386 నెంబరు వ్రాత
    ప్రతిలో గ్రంథ మింకమీద నీవిధమున ముగింపఁబడినది.
    క. వనరాశిఁ జనించిన శ్రీ
         వనజాక్షియొ యెదురుకొనిన వనదేవతయో
         వనవసదావళిమించో
         యని యెంచఁగ ఱాయి చెలువయై చెలు వగుచున్.136
    సీ. మును దలమున్క లౌ మోహాంధకారంబు
                        వెనుక దీసినరీతి వేణి తనర
         శాపరూపదినాంతచంద్రోదయములీల
                        మొలకనవ్వుల ముద్దుమోము మెఱయ
         బహుకాలపరిచితోపలత యంటిన మాడ్కి
                        కఠినవక్షోజయుగ్మంబు గులుక
         తదదృశ్యభావంబు తవిలి పోవని ఠీవి
                        గడుసన్నమౌ వలె గౌను వడక
    తే. క్షితిని లోహంబులను పైఁడి చేయు స్పర్శ
         వేది నొగి రామపాదారవిందరజము
         పూని శిల పైఁడి చేసిన నాన మించ
         కాంత యై నిల్చె గౌతమకాంత యపుడు.137
    క. తన మునుపటి వృత్తాంతము
         మునిపతి వీరలకుఁ దెలుప ముప్పే యనుచు
         ఘనలజ్ఞానతముఖి యౌ
         వనితకు రఘునందనుండు వందన మిడియెన్.138
    తే. పెండ్లికొడుకవు గమ్మని ప్రేమ మౌని
         రామ దీవించి శ్రీ రఘురామవిభునిఁ
         బూజ గావించుచున్న నద్భుతము గాఁగ
         గౌతముఁడు వచ్చి యా రాముఁ గాంచి పొగడె.139

    (ఖడ్గబంధము)


    క. సౌరధరధీర రఘువర
         పారదధర నీరజారి భవకీర్తిరమా
         మారీచమదవిరామా
         నీరదనిభకాయ రామ నృపతిలలామా!140
    ఉ. శ్రీరఘురామ నిన్ను నుతి సేయఁగ నెంతటివాఁడ నేను నీ
         పేరు దలంచి నంత నతిభీకరదుష్కృతముల్ దొలంగు నీ
         చారుపదాబ్జసంగతిని సంభవ యౌట పవిత్ర గాదె భా
         గీరథిలీల విభ్రమరకేళిని నంచు నహల్యఁ గైకొనెన్.141
    మ. దివి వర్షించె ప్రసూనవర్ష మపు డందెల్ మ్రోయ నాడెన్ సుధా
         శి వధూబృందము దివ్య దుందుభులు మ్రోసెన్ ................
         ...............................................................................
         ...............................................................................142
    తే. అంత సంతుష్టచిత్తుఁ డై యక్షపాదుఁ
         డధిప కూకుదమయ్యె నీయంఘ్రిపద్మ
         మనుచు పొగడుచు కాంతఁ దోడ్కొనుచుఁ జనియె
         సంతసిల్లుచు మునికులచంద్రుఁ డపుడు.143
    క. అని శ్రీ వైశంపాయన
         మునిముఖ్యుఁడు దెలుప విని ప్రమోదాన్వితుఁ డై
         జనమేజయమహిపాలుఁడు
         అనురాగము పొందుచుండె ననవరతంబున్.144
    ఉ. కౌస్తుభచారువక్ష సితకంజదళాక్ష కళిందకన్యకా
         నిస్తులనీలవర్ణ కమనీయ చరాచరమాననీయ ప
         ద్మాస్తనకుంకుమాంక నవమండన దానవదర్పఖండనా
         కస్తురిరంగ రంగపురకైరవపూర్ణకురంగలాంఛనా!145
    క. కుందారవిందసుందర
         మందారసుకీర్తిహార మహితవిహారా
         వందారుజనాభీప్సిత
         బృందారకరత్న సమరభిన్నసపత్నా!146
    మత్తకోకిల.
         చంద్రపుష్కరిణీతటాంచలచార చారణసన్నుతా!
         మంద్రనీరదమాలికాసుకుమార మారశతోపమా!
         సాంద్రసత్కరుణానవామృతసార సారసలోచనా!
         ఇంద్రచంద్రదినేంద్రముఖ్య సురేశ యీశవిభావితా!147

    [గద్యము—సమానమే.]