పుట:అహల్యాసంక్రందనము.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

అహల్యాసంక్రందనము

చ. ఇటు శపియించి గౌతమమునీంద్రుఁడు వేగ నిజాశ్రమస్థలిన్
     గిటుకునఁ జేరి కోప మెదఁ గీల్కొన భార్యను బిల్వ నంతలో
     దిటవెడలంగ నంగన మదిన్ దడబాటు చెలంగ మానిచెం
     గట వినయంబుతో నిలిచెఁ గాళ్ళకు నీళ్ళును గొంచు గొబ్బునన్.126
ఉ. ఆతఱి నాలతాంగిని మహాగ్రహదృష్టినిఁ జూచి 'యోసి, నీ
     చేతిజలంబు లంటనికఁ జెల్లునె యెంతటి జంతవే బలా
     రాతిని గోరి కూడితివి రాతిరి జామునఁ గావునన్ బలా
     రాతిశరీర మందు'మని రాజముఖిన్ సునఖిన్ శపింపఁగన్.127
క. గడగడ వడఁకుచుఁ దడఁబడి
     పడఁతుక జడదారిచరణపంకజములపైఁ
     బడి 'శాప మెపుడు గడతున్
     నుడువు'మనన్ బలికెఁ గరుణ నూల్కొన మునియున్.128
సీ. 'బలువైన రావణప్రముఖుల సమయింప
                    హరి జగద్విఖ్యాతి నతిశయించి
     చెలువుగా దశరథక్షితిభర్త కుదయించి
                    రామనామఖ్యాతి రహిని మించి
     మునిమాట విని తాటకిని గీటణంగించి
                    యతని యాగము గాచి యతిశయించి
     చతురుఁడై జనకరాజతనూజను వరించి
                    మహితకీర్తులు గాంచి విహిత మెంచి
తే. మౌనివరుతోడ నివ్వనమార్గమునను
     వరుస నిఁకమీద రాఁగలవాఁ డతండు
     నిజపదసరోజరేణుల నీదుశాప
     మోచనము సేయఁగలఁ' డంచు మునియుఁ బలికె.129
ఉ. అంతట నమ్మహాత్ముఁడు నిజాశ్రమవాటిఁ బరిత్యజించి దు
     ర్దాంతదురంతకేసరివితానమహెగ్రవరాహవాహజి