పుట:అహల్యాసంక్రందనము.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

83

     రతులఁ దేలించి మదనసామ్రాజ్య మేలు
     నేలికను నిన్ను నెడబాయఁజాల' ననుచు.119
చ. సరసిజపాళిఁ దుమ్మెదలు చాలుగ నిల్చినరీతి దేవరాట్
     కరకమలంబులన్ దనదు కన్నులఁ గాటుకరేక దాకఁగా
     హరు వమరంగ నొత్తుకొని యంగన కన్నుల నీరునించి 'యీ
     విరహము నెట్లు ద్రోతుఁ దగవే యెడబాయుట' లంచుఁ బల్కఁగన్.120
చ. 'కలకంఠీమణి, పోయివచ్చెదఁ గటాక్షం బుంచు నామీఁదన ని
     న్నెలమిన్ నమ్మినవాఁడ' నంచు సురరా జిట్లాడినన్ మందహా
     సలసద్వక్త్రము వాడఁ బ్రోడ మదిలో సంతాపమున్ గూడఁ జం
     చలమై ధైర్యము వీడ నింద్రుఁ గని వాంఛాలోలితస్వాంతమై.121
ఉ. 'నమ్మినదాన, నాతనువు నమ్మినదానను నీకు; నింక నే
     నమ్మకచెల్ల, నన్ను విరహాగ్నికి బాల్పడఁజేసి పోవుటల్
     సమ్మతమాయెనా, విడువఁజాలితివా, యెటులైన నిన్ను నేఁ
     బొమ్మనఁజాలఁ, జాలినను బొందినిఁ బ్రాణము లుండనేర్చునే.122
చ. అని యిటు పల్కి పల్కి బిగియారఁగఁ గౌఁటఁ జేర్చిచేర్చి గ్ర
     క్కున మధురాధరంబుచవిఁ గ్రోలుచుఁ గ్రోలుచుఁ బాకశాసనున్
     బనుప నతండు మెల్లఁగను బ్రక్కలు చూచుచుఁ బోవుచుండగా
     మునివరుఁడైన గౌతమునిముందఱ నింద్రుఁడు గానఁగాఁ దగెన్.123
ఉ. కంటికి నిద్రసొక్కు మయిఁ గాడిఁన గాజులనొక్కు మోవిపై
     నంటిన పంటిరక్కు సొగ సైనసిగన్ బలుచిక్కు గోటిచే
     గెంటినముద్దుచెక్కు రహిఁ గీల్కొనియుండినవానిగా మదిన్
     గంటున గౌతముండు తెరగంటిదొరం గని యాగ్రహంబునన్.124
ఉ. చండకరాభుఁడైన మునిచంద్రుఁడు కోపముతోడ 'నోరి, యా
     ఖండల, కండగర్వమునఁ గన్గొనలేక మదీయకాంత ను
     ద్దండత నాదువేషమునఁ దద్దయుఁ బొందితి వట్లుగాన నీ
     వండవిహీనుఁడై తిరుగు' మంచని మించి శపించె నెంచకన్.125