పుట:అహల్యాసంక్రందనము.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

అహల్యాసంక్రందనము

తే. మిగులఁ జెదరినయలకల మెయిపులకల
     కెలఁకు లరయుచుఁ జిలుకలకొలికి యపుడు
     దురుసునడలను గేళిమందిరము వెడలె
     నలరువిలుకాని మదహస్తి యౌ ననంగ.115
చ. వెలువడి యింతటంతటను వేగిరపాటున నొంటిపాటునన్
     గలయఁగఁ జూచి చూచి శచికాంతుని మెల్ల నహల్య పిల్చి బల్
     మెలఁకువతోడుతన్ బనుప 'మీఁదటి బుద్ధి యిఁకేమి పల్కితే
     వెలఁదిరొ, పోయివత్తునటవే దిటవే' యని యింద్రుఁ డిట్లనెన్.116
మ. 'తరుణీ, యేమని పల్కుదున్ గమనవార్తల్ పల్కనోరాడదే
     మఱి కాదంచని యెంచి పోదునన రామా, నేఁడు కాళ్ళాడదే
     సరసన్ నిల్చిన వచ్చు నీపతి యథేచ్ఛన్ నిల్వఁగాఁ గూడదే
     కఱవాయెన్ గదె ముచ్చటల్ మనకు రాకల్ పోక లిం కేడవే.117
ఉ. నీవును నేను నొక్కయెడ నెమ్మది నెమ్మదిగూడి యుండుటల్
     భావమునందు సైఁపకను పాపపుదైవత మిట్లు చేసె నే
     నేవహిఁ దాళఁజాలు దిఁక నెన్నఁడు మర్వకుమీ ననుం దయా
     భావనచేత' నంచు సురవర్యుఁడు వల్కిన కల్కి ప్రీతిగన్.118
సీ. 'మోహనాకార, నీమోముఁ జూచినఁ జాలు
                    సొబగైన చందురుఁ జూడనేల?
     మదనావతార, నీపెదవి యానినఁ జాలుఁ
                    గండచక్కెరపానకం బదేల?
     సరస, నీనెమ్మేనిచాయ సోఁకినఁ జాలుఁ
                    గనకాభిషేకంబు కాంక్ష లేల?
     శృంగారమూర్తి నీ చెట్టఁబట్టినఁ జాలు
                    నరిదితామరఁ గేల నంటనేల?
తే. కళల ననుఁ జాల మెప్పించి కౌఁగిలించి
     నీవి వదలించి కదియించి నేర్పు మించి