ఉద్యోగం చేసేవాళ్ళకి ఆంగ్ల తరగతులు నిర్వహించడం స్వాతంత్య్రం వచ్చినప్పటినించీ కూడా ఉంది.)
అక్కడ ఇంగ్లీషు నేర్చుకున్న అనతి కాలంలోనే ఆ ఉద్యోగులు చేస్తున్న పనుల్లో ఉన్నతిని పొందుతారు. అందుకుగల కారణం ఏమిటి అని వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకున్నప్పుడు వారికి దొరికే సమాధానం “కమ్యూనికేషన్ స్కిల్స్ " అనే ఆంగ్ల పదబంధం. ఇంగ్లీషు నేర్చుకోవడం ద్వారా వారిలోని కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగాయనే అపోహలో పడిపోతారు. నిజానికి వారిలోని కమ్యూనికేషన్ స్కిల్స్ అంగ్లభాష వలన పెరగలేదు. వారిలో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్‌ని తెలుగు రానివారి ముందు ప్రదర్శించడానికి ఇంగ్లీషు ఒక వాహికగా ఉపయోగ పడింది, అంతే. కానీ మనవాళ్ళు అంత దూరం ఆలోచించరు. తమకి పదోన్నతి రావడానికి ఇంగ్లీషు కారణమైందనీ, ఒకవేళ ఆ ఇంగ్లీషేదో అంతకు ముందే వచ్చి ఉంటే ఇప్పుడున్న స్థాయికి అప్పుడే చేరుకుని ఉండేవారమనీ భావిస్తారు. అంతేకాదు, తాము పడిన కష్టాలు తమ పిల్లలు పడకూడదని కోరుకుంటారు. దాంతో వెంటనే వెళ్ళి దగ్గరలో కనపడిన మంచి ఇంగ్లీషు మీడియం స్మూల్లో చేర్చేస్తారు.
ప్రపంచంతో సంపర్మం అవసరమైనప్పుడు ఆ అవసరమే వారికి కావలసినదాన్ని నేర్చుతుంది. అయితే అవసరం లేకపోయినా మనుషులు అందరూ తప్పకుండా నేర్చుకోవలసినవి కొన్ని ఉన్నాయి. మంచి నడవడిక, నైతిక ౠజువర్తన, సంస్కృతీ సంప్రదాయాలు మొదలైనవన్నీ మనం ఎటువంటి అవసరం లేకపోయినా నేర్చుకోవలసినవి. ఆచరించవలసినవి. భద్రంగా కాపాడుకోవలసినవి. ఎందుకంటే అవి మనకి అస్తిత్వాన్ని కల్పించే చిరునామాల్లాంటివి. అవన్నీ కూడా తల్లిభాషతోబాటుగా మనకి సంక్రమించే అస్తులు. వాటిని సంరక్షించడంలో బడి, ఇల్లు పరస్పరం పూరకాలుగా పనిచేస్తాయి. బడి పూడ్చలేని గోతుల్ని ఇల్లూ, ఇల్లు పూరించలేని ఖాళీల్ని బడీ పూరిస్తాయి
మనం మన పిల్లలని అంగ్రమాధ్యమంలో చేర్చడం ద్వారా, బడికీ ఇంటికీ మధ్య ఒక పెద్ద అగాథం ఏర్పరుస్తున్నాం. ఎలాగంటే, ఇంట్లో నేర్పే భాషవేరు. బడిలో నేర్వవలసిన భాష వేరు. ఇది పిల్లల సమస్య అయితే, బయట వ్యవహరించవలసిన భాష వేరు. బడిలో నేర్చక తప్పని భాష వేరు కావడం అయ్యవార్ల సమస్య. ఈ సమస్యవల్ల
ఉత్పన్నమైన మరో ప్రధానమైన సమస్య ఏమిటంటే అర్థం అయినా కాకఫోయినా వల్లె వేయించడం ఉపాధ్యాయులకీ, బట్టీ పట్టడం విద్యార్థులకీ అనివార్యం కావడం. ఈ సమస్య కేవలం మన భాషాపరమైన అవగాహనా రాహిత్యం వల్ల మాత్రమే ఉత్పన్నమైంది.
మన దేశంలో ఆర్ధిక ఒనరుల్ని సమకూర్చడంలో ప్రథాన పాత్ర పోషించేది రైల్వేలు. అందుకే రైల్వే బడ్జెట్ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మన దేశంలోని రైల్వేలైన్లలో అత్యధికశాతం బ్రిటీషువారు వేసినవే. స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా లెక్కలేనన్ని పెద్ద పెద్ద పట్టణాలకి రైలు సదుపాయం కల్పించుకోలేకపోయాం. మనం వారినించీ నేర్చుకున్నదేమిటి ? ఒకవేళ మనం ఆంగ్లే యుల్లా ఆలోచించగలిగి ఉంటే కనీసం కొన్ని పెద్ద పట్టణాల వరకూ అయినా రైల్వే లైన్సని వేసుకుని ఉండేవాళ్ళం. కానీ మనం నేర్చుకున్న ఇంగ్లీషు, మనకి ఇంగ్లీషువాడిలా నిర్మాణాత్మకమైన ఆలోచనల నివ్వలేదు. మనం వారినించీ కేవలం “సమాజాన్ని ఉపయోగించు కోవడం” ఎలాగన్నది మాత్రమే నేర్చుకుంటున్నాం. వారి అభివృద్దిలో కీలకపాత్ర పోషించిన “సమాజానీకి ఇవ్వడం” అనే మౌలిక సూత్రాన్ని విస్మరిస్తున్నాం. అందుకే క్రమేణా అవినీతికి చిరునామాగా మారిఫోతున్నాం.
ఇవన్నీ మనని మనం కోల్పోవడం వల్ల సంభవించిన విపరిణామాలు. వీటికి దారితీసిన కారకాల్లో భాష పట్ల మనం చూపించే నిర్లిప్తత కూడా ఒకటి. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. మన అస్తిత్వాన్ని కాపాడు కోవడానికి భాషని కూడా ఒక వాహికగా గుర్తిద్దాం. దానిపట్ల ఉదాసీనతని వదిలేద్దాం. పిల్లలని తెలుగులో చదివిద్దాం, తెలుగులో ఆలోచించడం నేర్చుదాం. తద్వారా ముందు తరాలవారికి మన ఉనికిని తెలియజేద్దాం. మన ఇల్లు మనమే చక్కదిద్దుకుందాం. దీనికి ప్రభుత్వాలిచ్చే నిధులతో పనిలేదు. ఉన్న పనల్లా మన పూనిక అనే వెలకట్టలేని పెన్నిధితోనే.
“ఒక బిడ్డ మాతృభాషలో ఒక సంవత్సరంలో నేర్చుకున్న విద్య పరాయి భాషలో నేర్చుకోవడానికి నాలుగేళ్ళు పడుతుంది”
- - రవీంద్రనాథ్ ఠాగూర్