పనికొచ్చేకథ
జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి 94400 37258
ర్యాంక్
గులాబీలా ముద్దొస్తూ ముల్లులా పొడిచే ఏకైక ప్రాణికున్న అందమైన పేరే భార్య. ఈ విషయాన్ని మరోసారి నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉంది మా ఆవిడ. ఎప్పుడూ నేనే దానికి బలి చక్రవర్తిని.
కానీ ఈ రోజు మాత్రం ఆ అద్బష్టం మా పునీత్ గాడికి పట్టబోతోంది. వాడు టెన్ స్టేట్ రాంకర్. ఇప్పుడు ఇంటర్లో కూడా స్టేట్ ర్యాంకర్ కావాలనేది మా ఆవిడ రెండేళ్ళుగా కంటున్న పంచరంగుల కల. కానీ వాడీసారి కాలేజీ లెవెల్లో కూడా ఏ ర్యాంకూ తెచ్చులోలేకపోయాడు. దాంతో వాడిమీద పీకల్టాకా కోపంతో ఊగిపోతూ, వాడికోసం ఎదురు చూస్తూ కూర్చుంది.
ఈ కాకలో ఉండగా, వాడు వచ్చాడంటే, తను వాడి దుంప తెంపెయ్యడం ఖాయం. అందుకే, ర్యాంకులనేవి వాపునేగానీ బలుపుని సూచించవనీ, వాటిని నమ్ముకుని రెజ్లింగ్ పోటీలకి వెళ్ళకూడదనీ, నానారకాలుగా నచ్చజెప్పాను. నా మాటల్లో బలుపనే పదాన్ని పట్టుకుని, వేళతప్పకుండా ముప్పాద్దులా మెక్కుతూ కూర్చోవడం వళ్లే వాడికి తెగ బలిసిందనీ, ఆ బలుపుకి కారణం వాడేనంటూ వాడి బదులుగా నన్ను తగులుకుంది. అయినా సరే వాడు రాగానే చిందులు తొకొద్దనీ, అపార్జుమెంట్లో అందరి ముందూ వాడి పరువు తీసి నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దనీ చిలక్కి చెప్పినట్టు చెప్పాను. వాడొచ్చేలోపు నేను స్నానం పూర్తి చేసి వచ్చేస్తే మంచిది. వాళ్ళమ్మ దాడికి కాలో చెయ్యో అడ్డం వెయ్యొచ్చు.
వాడి ఖర్మకాలి సరిగా నేను స్నానం చేస్తూండగానే ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఇంటికి వచ్చేశాడు పునీత్ గాడు. .
నా స్నానం పూర్తయ్యేంతవరకైనా మా ఆవిడ వీరావేశాన్ని అడ్డుకో స్వామీ అంటూ వెంకన్నకి మొక్కుకుంటూండగానే తాప్ అంటూ చెంపదెబ్బ తగిలిన చప్పుడు వినిపించింది. ఆ వెనకే మొదలైంది ఏడుపు. వీడొకడు.., ఒక్కదెబ్బ కూడా తట్టుకోలేదు. పనికిమాలిన వెథవలా అక్కడే ఏడుస్తూ కూర్చోకపోతే, “ర్యాంకు ముఖ్యమా -తెలివి ముఖ్యమా” అని ఎదురు తిరిగి, తన పరిస్థితి ఏమిటో చెప్పి తగలడచ్చుగా? తనకి రాంకు రాకపోవడానికి గల కారణాలను దానికి అర్ధమయ్యేలా వివరించి ఏడవ్వచ్చుగా? ఊహూ... ఆపని మాత్రం చచ్చినా చెయ్యడు. అయినా వాడినని ఏం లాభం? మా ఆవిడకి ఎదురు తిరిగి నిలబడే థైర్యం నాకే లేదు. అందుకే తను రానురానూ గయ్యాళిలా తయారౌతోంది.
అంతలోనే మరో చెంపదెబ్బ తగిలింది. వాడి ఏడుపు తారస్థాయికి చేరింది. అయినా అక్కడే ఉండి చెంపదెబ్బలు తింటూ అఘోరించకపోతే తన గదిలోకి వెళ్ళి తలుపేసుకోవచ్చుగా? చివరికి కన్నతల్లి కోపాన్నించి తప్పించుకునే తెలివితేటలు కూడా లేవు వెధవకి. ఎలా బతుకుతాడొ ఏంటో.
తనకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధిరాదు. అధికారం ఉందికదా అవకాశం దొరికితే చాలు, వాడినీ నన్నూ షంటెయ్యడమే. ఆ పక్కింటి అరవావిడనీ ఈ పక్కింటి మార్వాడీ ఆవిడనీ చూసి ఈవిడకూడా అడ్డంగా రెచ్చిపోతోందీమధ్య. అసలీ గయ్యాళి గంపలందరికీ గురువు వాచ్ మేన్ పెళ్ళాం. సాయంత్రం అయితే చాలు వాచ్‌మెన్ మందేసుకురావడం.., ఆ తాగిందంతా దిగేదాకా వాళ్ళావిడ కుమ్మి పారెయ్యడం. దాన్హో పోలిస్తే మా ఫస్ట్ ఫ్లోర్ లేడీసే బెటర్. పిల్లల్నేగానీ మొగుళ్ళని కొట్టరు.
అంతలోనే మరో దెబ్బ వినిపించింది. వాడి ఏడుపు తారస్థాయినించీ ఒక్కసారిగా మంద్రస్థాయికి పడిపోయింది. అంటే అరిచి గీపెట్టి అందర్నీ ఆకర్షించి నవ్వులపాలవ్వడం కంటే కుళ్ళి కుళ్ళి ఏడవడమే మంచిదని వాడికి అర్ధమైందన్నమాట. అది ఫాల్స్ ప్రిస్టేజికి ఫుట్ స్టెప్. అంటే పతనానికి ఆరంభం. కానీ ఏం చేస్తాం, ఇంటిగుట్టు రచ్చబండకి ఎక్కించలేం కదా? అందుకే, నేను ఏమైపోయినా పరవాలేదు. కానీ, వాణ్ణి పతనం కానివ్వకూడదు. అంటే, నేను వెంటనే వెళ్ళి వాళ్ళమ్మ బారినించే వాడిని తప్పించాలి. అందుకే గబగబా నాలుగు చెంబులు నీళ్ళు నెత్తిమీద పోసుకుని, స్నానం అయిందనిపించుకుని బైట పడ్డాను.
అప్పటికే తను గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటోంది. ఇది నేను ఊహించని పరిణామం. నా లెక్క ప్రకారం తన బారినుండి తప్పించుకోవడానికి వీడు గదిలోకి దూరాలిగానీ ఆవిడ వెళ్ళి తలుపేసుకోకూడదు.
వాడింకా గట్టిగా ఏడుస్తూ సోఫాలో కూలబడ్డాడు. నాకు పరిస్థితి ఏమాత్రం అర్థం కాలేదు. కానీ అసంకల్పిత ప్రతీకార చర్యగా పరిగెత్తుకుంటూ వెళ్ళి, తను వేస్తున్న తలుపుని తెరిచే ప్రయత్నం చేశాను. లోపల గడియ పెట్టబోతున్నట్టుంది. అంత త్వరగా తెరుచుకో లేదు. నేను బలంగా తోస్తూ తలుపు గడియ పడకుండా ఆపగలిగాను. కానీ ఆ తలుపు తెరుచుకోకుండా తను అడ్డుపడుతోంది. .
నేనొక్కడినీ తలుపుతో తంటాలుపడుతుండటం గమనించాడు మా పునీత్. అందుకే కళ్ళు తుడుచుకుంటూ వచ్చి నాకు సాయం పట్టాడు. ఇద్దరం కలిసి అతి ప్రయత్నం మీద తలుపుని తోస్తే ఏముంది... తన చెంపలు తనేవాయించుకుంటూ వచ్చి నా గుండెలమీదకి వాలిపోయింది.
అంటే ఇంతవరకూ తను కన్న కలల్ని కల్లలు చేసినందుకు వాడిని శిక్షించడం లేదు.
వాడిమీద పెంచుకోవలసిన ఆశలన్నింటినీ వీడి ర్యాంకు మీద పెంచుకున్నందుకు తనని తానే శిక్షించుకుంటోంది.
(అంకితం: ర్యాంకే విద్యకి పరమావధిగా భ్రమించే అమాయకపు తల్లులందరికీ)