Jump to content

పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాటల నిర్మాణం

(గత సంచిక తరువాయి...)

-వాచస్పతి

పదనిష్పాదనకళ

The joy of coining new words!

నాలుగో అధ్యాయం

తెలుగులో క్రియాకల్పన సాధనాలు

తెలుగువారి పూర్వీకులు క్రియాకల్చన చేసిన విధానం :

మన ప్రాచీన తెలుగుపూర్వీకులు రెండక్షరాల నామవాచకాలకీ, విశేషణాలకీ కొన్ని ప్రత్యయాలు చేర్చడం ద్వారా వాటిని క్రియాధాతువులుగా మార్చారు. మనం ఇప్పటికీ వాటిని వాడుతూనే ఉన్నాం. ప్రతి మూడక్షరాల తెలుగు క్రియాధాతువూ ఇలా ఏర్పడినదే. వారు చేర్చిన ప్రత్యయాలు

(i) యు, చు, ఇంచు, ఇల్లు మొ. “యు" చేఱిన పదాలు కొన్ని :

పులి = పులుపు; పులియు = పులుపుగా అగుట
తడి = చెమ్మ; తడియు = చెమ్మగా అగుట
తడ = ఆలస్యం; తడయు = ఆలస్యం చేయు; తడవు = సేపు, కాలవ్యవధి (ఇంత తడవు మొ.)
తెలి = తెలుపు; తెలియు = తెలుపుగా అగుట
విరి = పువ్వు; విరియు = పువ్వులా విచ్చుకానుట
మెఱ = ప్రకాశము; మెఱయు = ప్రకాశవంతమగుట

(ii) “చు" చేఱిన పదాలు కొన్ని :

మొల = కింద; మొలచు = కింద నుంచి వచ్చు
నెఱ =నేర్సు; నెఱచు- నేర్చు = అభ్యసించుట
వెఱ = భయం; వెఱచు = భయపడుట (-వెఱపు)
చెఱ = బంధనం; చెఱచు = బంధించి అనుభవించుట
తల = మెదడున్న శరీరభాగము; తలచు = తలతో పనిచేయుట
వల = ప్రేమ/శృంగారభావము; వలచు = శృంగారపరముగా ప్రేమించు
కల = అలజడి; కలఁచు = అలజడి కలిగించు (కలఁత)
మల = ఱాయి; మలచు = ఱాతి మీద పనిచేయు
పొడ = శరీరం (రూపాంతరం = పొడలు - ఒడలు)
పొడచు = శరీరములోకి దించుట
కోఱ = పదునైన పక్క పన్ను; కోఱచు- కఱచు = పంటితో పట్టుకానుట
నడ = కదలిక (నడపీనుఁగు = కదిలే శవం); నడచు = కాళ్ళతో కదులుట
తెఱ = అడ్డుగా కట్టిన గుడ్డ; తెఱచు = అడ్జుగా కట్టినవాటిని తీయుట
ముడి = పొడవు-వెడల్పులను తగ్గించుట; ముడుచు = సంకోచింపజేయుట
నిల = నేల; నిలచు = నేలపై ఉండు

(iii) “గు" చేఱిన పదాలు కొన్ని :

కల = అలజడి; కలఁగు = అలజడికి లోనగు (కలఁత/కలఁక)
నలి = సూక్ష్మం, కృశించుట; నలుగు = ముడతలు పడి కృశించుట (నలఁత = జబ్బు)
వెలి = తెలుపు; వెలుఁగు = తన పరిసరాల్ని తెల్లగా చేయుట
మొఱ = చప్పుడు మొఱఁగు = (కుక్క ) చప్పుడు చేయుట మొయు/మోగు = చప్పుడు చేయుట
కొఱు = పై భాగం; కొఱుగు - గొఱుగు = పై భాగాన్ని తొలగించు; గొఱగ = గొఱగబడ్జవాడు, శివభక్తుడు (తల

గొఱిగించుకున్నవాడు) (కొఱితి మరన్‌ మాన్‌ -కొత్తిమెర = ఆకుల పై భాగాలు కోసుగా ఉన్న మొక్క)

(iv) “కు" చేఱిన పదాలు కొన్ని :

కోఱ = పదునైన పక్క పన్ను; కోఱకు - కొఱకు = పంటితో గ్రుచ్చు
వెద = విత్తనం; వెదకు = విత్తనాలు ఏరడం
పల్లు = పన్ను; పలుకు = ఉచ్చరించుట
కుఱు = కింద/చిన్న కుఱుకు - కూర్ము - కులుకు = పడుకొనుట కుఱుంకు = క్రుంకు = సూర్యుడు అస్తమించుట

కుఱుంగు = క్రుంగు = మనిషి తగ్గిపోవుట

ఇవి కాక రెండక్షరాల విశేషణాల (adjectives)కి “ఇల్లుక్‌ ఇంచుక్‌ " చేర్చి క్రియాధాతువుల (verb-roots)ని నిష్పాదించారు:

సన్న + ఇల్లుక్‌ = సన్నగిల్లు; ఏవ = అసహ్యం (ఇప్పుడు యావ అంటున్నారు); ఏవ+ఇంచుక్‌ = ఏవగించు

ఈ చర్చ ఎందుకు చేశామంటే ఇంగ్లీషులో లాగా తెలుగులో కూడా ఏ నామవాచకాన్నెనా క్రియాపదంగా మార్చి వాడుకునే సౌలభ్యం ఉందని తెల్పడానికే! సౌలభ్యాలకేం, ఎన్నో ఉన్నాయి సిద్ధాన్నంలా! కాని వినియోగించుకునేవారే కఱువయ్యారు. ఒకవేళ వినియోగించినా చెవులకేదో కొత్తగా వినిపిస్తోందని వాడడం మానేస్తున్నారు. ఇలాంటి భాషాఖేషజాల నుంచి బయటపడి స్వేచ్చగా, నిర్మొహమాటంగా తెలుగుపదాల్ని ప్రయోగించే మంచిరోజులు రావాలని ఆశిద్దాం.

మనం 3 రకాల పదాల్ని కల్పించాల్సి ఉందని ఇదివఱకు అనుకున్నాం. వాటిల్లో మొదటి విభాగం క్రియాధాతువులు. ఏ భాషలోనైనా ప్రాథమికక్రియలు కొన్నే ఉంటాయి. మిగతా క్రియలన్నీ నామవాచకాల (nouns)నీ, విశేషణాల్నీ (adjectives) రూపాంతరించగా ఏర్పడ్డవై ఉంటాయి. ఇలా క్రియల్ని కల్పించడానికి తెలుగు అందిస్తున్న సౌకర్యాల గుఱించి మనం ఇప్పుడు చర్చిస్తున్నాం.

తెలుగులో క్రియా ధాతువులు అంతమయ్యే విధానాన్ని ముందు

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మార్చి-2021

29