పుట:అమ్మనుడి మార్చి 2021.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిధులు విడుదల చేసింది. ఈ శిధిలాలు సేకరించి రాజమహేంద్రి, ఏలూరు మ్యూజియాలలో పడేసినట్లు, ప్రాక్చారిత్రక యుగం సమాధులకోసం తవ్వకాలు జరుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి.

మన ముందుతరం, నాగార్జున సాగర్‌లో మునిగిపోనున్న పురావస్తు సంపదను నాగార్జున కొండలో భద్రపరిచి, నది మధ్యలోనే ఒక స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మించారు. మన తరంలో ఇంత చరిత్ర మునిగిపోతుంటే ఏమి జరుగుతుందో పట్టించుకొనే వారే లేరు.

ముంపు బారిన పడుతున్న దేవాలయాలు, పవిత్రస్థలాలు, చారిత్రక స్థలాలు, (ఒకనాటి పోలవరం ప్రాజెక్టు రిపోర్టు ప్రకారం).

శివగిరి గ్రామం, ఒక కోట ,శిధిలమైన దేవాలయం, గండిపోచమ్మ, కొమరందిబ్బ, దేవీపట్నం, పెంకులపాడు, కచ్చులూరు, దేవరగొంది, కటుకూరు, పేరంటపల్లి, శ్రీరామగిరి, రావిగూదెం, చీరవల్లి, పోచవరం, దుర్గంకోట, రాజుపేట, ఏలూరుపాడు, చిగురుమామిడి, టేకూరు, ఎటిపాక, ఏలేరు, రుద్రంకోట, అబిచెర్ల, చొప్పల్లె, రామవరం, సీతంపేట, ఇసునూరు, కొరుటూరు, కొండమొదలు, కొమరారం, మాదాపురం, కుమారరాంపురం మొదలైనవి.

ధూప దీప నైవేద్యాలు, ఉత్సవసేవలు ఈ మునిగి పోయే వాటిలో కొన్ని థూపదీపనైవేద్యాలతో, ఉత్సవసేవలతో విలసిల్లుతున్నాయి. వాటిలో ఒకటి ముసునూరినాయకుల శ్రీరామగిరి. 'పెదజియ్యర్‌ స్వామి ఇక్కడ శ్రీరామక్రతువు నిర్వహించారు. చినజీయర్‌ స్వామి 2000 సంవత్సరంలో దర్శించారు. మరి ఈ పరిస్థితి వారి దృష్తికి వచ్చిందో లేదో ! ఇటువంటి దేవాలయాలను ఎగువ ప్రాంతంలో పునఃప్రతిష్ట చేయాలి. కొన్ని విగ్రహాలు చెరువుకట్టల మీద, రచ్చబండల దగ్గర గ్రామదేవతలుగా ఉన్నాయి.. ప్రభుత్వానికి వదిలేస్తే అరకొరగా సేకరించిన శిధిలాలు మ్యూజియంలలో పడి ఉంటాయి. గతవైభవం పేరిట, దేవుళ్ళ పేరిట, కులాల పేరిట కొట్టుకుంటున్న వర్గాలు ఈ చారిత్రక సంపదను భద్రపరుచుకోకపోతే భావితరాలు చరిత్ర హీనులైపోతారు.

ఒకనాడు చరిత్రవేత్తలు పుట్టపర్తి శ్రీనివాసాచారి, కృష్ణశాస్త్రి, చల్లా రాధాకృష్ణ, నాగార్జునసాగర్‌ కింద మునిగేపోయే శిధిలాలను పునర్నిర్మాణం చేసారు. గడియారం రామకృష్ణశర్మ తుంగభద్ర కింద జోగులాంబ దేవాలయం మునిగిపోకుండా కరకట్ట కట్టించారు. ఈతరం చరిత్రకారులు ఈ వివరాలు వెలుగులోకి తేవాలి. పోలవరం'ప్రాజెళ్టుకు గేట్లు బిగింపు, నిర్వాసితుల తరలింపు జరుగుతున్నంత వేగంగా ఈ శిధిలాల సేకరణ, మ్యూజియం నిర్మాణం, దేవాలయాల పునఃప్రతిష్ట జరగాలి.


సంఘ్ (ఆర్‌.ఎస్‌.ఎస్‌.) 'ముసునూరి నాయకుల 'ను పట్టించుకోరా?

పోలవరం నిర్మాణంతో మునిగిపోనున్న శ్రీరామగిరి దేవాలయంతో పాటు అనేక వారసత్వ గుర్తులు, చరిత్ర కనుమరుగైపోనున్నది. విదేశీ దురాక్రమణలను ఎదిరించి నిలబడిన ముసునూరి నాయకుల గుర్తులు కూడా చెరిగిపోనున్నాయి. సంఘ్(ఆర్‌.ఎస్.ఎస్ )శాఖల్లో ప్రతిరోజూ గానం చేసే ఏకాత్మతాస్తోత్రంలోని ముసునూరినాయకౌ' ను వారు పట్టించుకోవాలి కదా?

దక్షిణాపధాన ముస్లిం దురాక్రమణదారులను తరిమికొట్టి హిందూరాజ్యస్టాపన చేసిన తెలుగువారి తొట్టతొలి చక్రవర్తి ముసునూరి కాపయ నాయకుడు.

ముసునూరి కాపయనాయకుడు[క్రీ శ 1332-1368) ముస్లిం పాలన నుంచి ఆంధ్రాను విముక్తం చేసి ఎన్నో హిందూ రాజ్యాల స్థాపనకు స్ఫూర్తినిచ్చిన అరివీక భయంకరుడు. వీరివల్ల స్ఫూర్తిపొందిన రాజ్యాల్లో హోయసల, ద్వారసముద్రము మరియు అరవీటి రాజులు, హరిహర మరియు బుక్క రాయలు హోయసల రాజ్యమును జయించి విద్యారణ్యులవారి బోధనలవల్ల ఆనెగొందిలొ విజయనగర రాజ్యము స్థాపించారు.

ప్రొలయ నాయకుడి మరణానంతరం ఆయన పినతండి కుమారుడైన ముసునూరి కాపయ నాయకుడు క్రీ.శ. 1332లో ఆంధ్రదేశ విముక్తి ఉద్యమానికి నాయకత్వం వహించాడు. కాపయ నాయకుడి చరిత్రకు ముఖ్య ఆధారాలు ఇతడు వేయించిన పోలవరం, పిల్లలమర్రి, గణపేశర శాసనాలు. అంతేకాకుండా రేచర్ల వెలమల చరిత్రను వివరించే వెలుగోటి వారి వంశావళి, ఫెరిస్టా రచనలు ప్రధాన ఆథారాలుగా ఉన్నాయి.

మహ్మదీయుల ఆధీనంలో ఉన్న ఓరుగల్లు కోటను కాపయ నాయకుడు కర్ణాటక హోయసాల పాలకుడైన మూడో వీరభల్లాలుడి సహాయంతో స్వాధీనం చేసుకున్నాడు. అప్పటి ఓరుగల్లు దుర్గ పాలకుడైన మాలిక్‌ మక్బల్‌ యుద్దం నుంచి పారిపోయాడు. కాపయ నాయకుడు క్రీ.శ. 1337లో ఓరుగల్లును ఆక్రమించాడు. తెలంగాణలోని మెతుకుసీమ, ఇందూరు (నిజామాబాద్‌లోని కౌలాసకోట, నల్గొండ, పానగల్లు, దేవరకొండ, భువనగిరి ప్రాంతాలతోపాటు కృష్టా గోదావరి నదీ తీర ప్రదేశాలు కూడా ఇతడి రాజ్యంలోకి వచ్చాయి. కాపయ నాయకుడు తన పాలనను రేకపల్లి దుర్గం నుంచే నిర్వహించాడు. క్రీ.శ. 1346 నాటి గణపేశ్వర శాసనం ఇతడిని 'అనుమనగంటి పురవరాధీశ్వరా ' అనే బిరుదుతో ప్రస్తావించింది. ఉత్తర తెలంగాణ, కృష్ణానది పర్యంతం ఉత్తర తీరాంధ్ర ప్రాంతంపై కాపయ నాయకుడు ఆధిపత్వం చెలాయించినట్లు చెప్పొచ్చు.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * మార్చి-2021

28