పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రాచీనతెలుగు విశిష్టకేంద్రాన్ని కాపాడుకొనేందుకు ఉద్యమించండి

కేంద్ర ప్రభుత్వం మైసూరులోని భారతీయభాషల సంస్థను ఒక విశ్వవిద్యాలయంగా మాచ్చేందుకూ, 'ప్రాచీనవిశిష్ట భాషల కేంద్రాలను దానిలో చేర్చేందుకు నిర్ణయించి, ఇందుకోసం ప్రణాళికను రూపొందించేందుకు ఒక నిపుణుల సంఘాన్ని నియమించిన సంగతి, దానివల్ల మనకు జరుగనున్న అన్యాయాన్ని గురించిన అంశాలు జనవరి '“అమ్మనుడి 'లో మన ముందుకు వచ్చాయి. తెలుగుకుప్రాచీనభాషా ప్రతిపత్తికై 2004 నుండి 2008 వరకు జరిగిన ఉద్యమంలో ముందుగా కదిలి అందరినీ మేల్మొల్పినవారిలో ఒకరైన ఆచార్య ఆర్‌.వి.యస్‌.సుందరం, ఇప్పుడు కొందరు మిత్రులతో ఈ విషయమై చర్చించి మన తక్షణ కార్యక్రమాన్ని సూచిస్తూ చేసిన విజ్ఞప్తిని ఈ కింద ఇస్తున్నాము. తెలుగు భాషోద్యమకారులూ, ఆసక్తిగల సంస్థలూ, వ్యక్తులూ ఇందుకోసం కదలి వెంటనే ఉద్యమించాలని కోరుతున్నాము. -తెలుగుభాషోద్యమ సమాఖ్య 98480 16136

ప్రపంచంలోని తెలుగు సోదరులందరికీ విజ్ఞప్తి:

ఈ క్రింది మనవి ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్యులకు, రాష్ట్రంలోని, కేంద్రంలోని ప్రజాప్రతినిధులకు, ప్రధానమంత్రి గారికి, ఉపాధ్యక్షులకు, తెలుగు సంఘాలకు, ఇందుకోసం ఏర్పడిన గోపాలస్వామి కమిటీకి (gopalaswamin@ gmail.Com) చేరవలసి ఉంది. తెలుగు వారికి తెలుగులో, ఇతరులకు ఆంగ్లంలో మీకు తోచిన మార్పులను చేసి పంపండి. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులకు అందజేయండి. సంక్షిప్త సందేశాలను ట్విట్టర్‌, ఇతర మాధ్యమాల ద్వారా పంపండి. మనం మేల్మొనక పోతే ఎంతో కష్టపడి సంపాదించుకున్న ప్రాచీన హోదాను పోగొట్టుకుంటాము. -ఆర్‌. వియస్‌.సుందరం

ప్రాచీనతెలుగు విశిష్టకేంద్రానికి స్వతంత్రప్రతిపత్తి కోసం ఉద్యమించండి

భారత ప్రభుత్వం ప్రాచీన భాషల అభ్యున్నతికోనం సంస్కృతం, తమిళం, తెలుగు, కన్నడ, ఒడియా, మలయాళ భాషలకు ప్రాచీన హొదా ప్రకటించి అమలు చేస్తోంది. తమిళానికి ప్రాచీన హోదా ఇచ్చినప్పుడు (2004) తెలుగువారు, కన్నడిగులు నాలుగు సంవత్సరాలు పోరాడి 2008లో ప్రాచీన హోదాను సంపాదించుకున్నారు. ఇది తెలుగు వారి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. 3000 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు భాషకి ప్రాచీన హోదా రావటంవల్ల ఆ భాషాసాహిత్యాల ప్రాచీనతనిగురించి, వైశిష్ట్యాన్ని గురించి లోతుగా పరిశోధనలు జరిపేందుకు అవకాశం లభించింది.

సంస్కృతం, తమిళం ప్రాచీన హోదాని పొందటమే కాకుండా స్వతంత్ర ప్రతిపత్తిని సంపాదించుకున్నాయి. తెలుగు కేంద్రానికి కూడా అలాంటి స్వతంత్ర ప్రతిపత్తి లభించాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా మైసూరులోని భారతీయ భాషా సంస్థను (సి.ఐ.ఐ.ఎల్‌) భారతీయ భాషల విశ్వవిద్యాలయంగా మార్చాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకాని ఆ విశ్వవిద్యాలయ విధివిధానాలు, మార్గదర్శకాలను రూపొందించడానికి 11 మంది సభ్యులతో కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఉభయ రాష్ట్రాల్లోని ఒక్క తెలుగు వారు కూడా లేకపోవడం విచారించదగ్గ విషయం. ప్రాచీన భాషల కేంద్రాలు భారత ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే భారతీయ భాషల విశ్వవిద్యాలయంలో భాగంగా ఉంచడానికి తగిన సూచనలను ఇవ్వవలసిందిగా విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం నియమించిన సమితిని ప్రభుత్వం కోరింది. వెంటనే తమిళ సోదరులు తమిళ కేంద్రాన్ని భారతీయ భాషల విశ్వవిద్యాలయంలో కలపడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి తమ వ్యతిరేకతను తెలియజేయడమే కాకుండా, పత్రికల ద్వారా కూడా తెలియజేశారు. తమిళ కేంద్రాన్ని వదలి తెలుగులాంటి ఇతర భాషలని మాత్రమే చేర్చే ప్రసక్తి ఉన్నా తమిళులు తమని మాత్రం వదిలెయ్యాలని పోరాటానికి సిద్దమయ్యారు. ఈ విషయాన్ని తెలుగువారు తప్పక గమనించాలి.


ప్రస్తుతం నెల్లూరులో ఉన్న ప్రాచీన తెలుగు కేంద్రాన్ని విశ్వవిద్యాలయంలో కలపడం వల్ల, స్వయం ప్రతిపత్తిని కోల్పోవడమే కాకుండా, అభివృద్ది కుంటుపడుతుంది. దీనికి కేటాయించవలసిన ఆదాయవ్యయాలు కూడా విశ్వవిద్యాలయ పరిధిలోకి వెళ్ళి కుదించుకుపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాల్లొని విశ్వవిద్యాలయాల్లో తెలుగుశాఖలు చాలా పనిచేస్తున్నాయి. అదే విధంగా హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలోను, అనంతపురంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయు౦లోను తెలుగుశాఖలున్నాయి. వీటన్నింటిలోను బొధన ప్రధానంగాను పరిశోధన పరిమితంగాను ఉన్నాయి.

ఈ నేపథ్యంలో 'ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని భారతీయ భాషల విశ్వవిద్యాలయంలో కలపడం వల్ల తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఈ కేంద్రం లక్ష్యాలను విశ్వవిద్యాలయం ద్వారా సాధించడం సులభతరం కాదు. కాబట్టి ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని న్వయం ప్రతిపత్తి కేంద్రంగానే విశ్వవిద్యాలయంలో కలవకుండా ఉంచాలని తెలుగు భాషాభిమానులు, సాహిత్యకారులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఇది తెలుగువారి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. తెలుగుని కించపరచే ఈ ప్రయత్నాన్ని అడ్జుకోవలసి ఉంది.

ఈ విషయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వం ప్రాచీన తెలుగు విశిష్ట కేంద్రానికి భూమిని కేటాయించాలి. కేంద్రానికి స్వతంత్ర ప్రతిపత్తిని కలిగించేందుకు చర్య తీసుకోవాలని కేంద్రానికి వెంటనే లేఖ రాయాలి. ప్రజాప్రతినిధులందరూ దీనిపై దృష్టి సారించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి. లోకసభలోనూ, రాజ్వసభలోనూ మన ప్రతినిధులు ఈ విషయాన్ని ప్రస్తావించాలి. తమిళానికి ఇచ్చినట్లే తెలుగు కేంద్రానికికూడా స్వతంత్ర ప్రతిపత్తిని ఇవ్వాలని ఒత్తిడి తేవాలి.

ప్రాచీన తెలుగు విశిష్ట కేంద్రం స్వతంత్ర ప్రతిపత్తి సాధన సమితి

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2021

6