పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంపుటి: 6

సంచిక: 9

అమ్మనుడి

ఫిబ్రవరి 2021

తెలుగులో ఏలుబడికి కట్టుబడే పార్టీలకే ఓటు

ఫిబ్రవరి 21 - ఎల్లనాడుల అమ్మనుడుల పండుగ. దీన్ని గొప్పగా జరుపుకోవలసిన బాధ్యత ప్రజలకూ, ప్రభుత్వానికీ ఉంది. ఇరవై రెండేళ్లుగా 'యునెస్తో ఈ కట్టుబాటును మన ముందుకు తెచ్చింది. దీన్ననుసరించి ప్రపంచంలో ఎన్నో దేశాల ప్రభుత్వాలు, ప్రజాసంస్థలు, ప్రజలు జరుపుకొంటున్నారు. మన దేశంలో కూడా క్రమంగా ఈ అలవాటు పుంజుకొంటున్నది. కేంద్రప్రభుత్వం కూడా నాలుగైదేళ్లుగా ఈ పిలుపునిస్తున్నది.

ఉమ్మడి తెలుగురాష్ట్రంలో యునెస్కో పిలుపును ముందుగా పట్టించుకున్నది “జనసాహితి” సాహిత్య సంస్థ. 2003 ఫిబ్రవరి, 21న తెలుగు భాషోద్యమసమాఖ్య "పెద్దఎత్తున ప్రారంభమై తెలుగు రాష్ట్రంలోనే కాక, పొరుగురాష్ట్ట్రాల్లోని తెలుగువారిలో కూడా కదలిక కలిగించింది. క్రమంగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశంలో పలురాష్ట్రాల్లోనూ పనిచేస్తున్న తెలుగు సాంస్కృతిక సంఘాలు ఈ పండుగను జరుపుకొంటున్నాయి. అయితే రెండు రాష్ట్రాలుగా ఏర్చడిన తర్వాత రెండు ప్రభుత్వాలూ ఈ సంగతిని పట్టించుకోవడంలేదు.

భాష ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాలే అయినా, ప్రజల భాషల్లోనే పాలించాలనే ప్రాధమిక సూత్రానికి అవి కట్టుబడి ఉండడం లేదు. తప్పనిసరి అవసరం అయినంతవరకే ప్రజలభాష వారికి కావాలి. ఓట్లకోసం, సీట్లకోసం తప్ప దేనికీ ప్రజాభాషలను పట్టించుకోరు.

పరిమితికి మించి ఆంగ్ల భాషను వినియోగిస్తూ క్రమంగా విద్యారంగాన్నంతా ఆంగ్లంలో నడిపే ధోరణి 'ప్రబలడంతో, పరిపాలనారంగమంతా ఆ భాషకు లొంగిపోయింది. నేటితరం పిల్లలు తెలుగు లిపిని చదవలేని స్థితి ఏర్చడింది. మచ్చుకు, ఇప్పుడువస్తున్న తెలుగు సినిమాల పేర్లు, వాటి ప్రకటనలనూ చూడండి. అంతా ఇంగ్లీష్‌లోనే. సినిమా పేరు మాత్రమే తెలుగులో, తక్కిన వివరమంతా ఆంగ్లంలో. కొన్న సినిమాలకైతే ప్రకటనల్లో ఒక్క తెలుగు అక్షరం కూడా ఉండదు. ఏ తెలుగు దినపత్రికను చూసినా ఈ ధోరణి కనబడుతుంది. ఏరంగంలోనైనా ఇదే పోకడ. ప్రభుత్వ పథకాలను మాత్రం భారీగా తెలుగులో కూడా పత్రికల్లో ప్రభుత్వం 'ప్రకటిస్తుంది- అవి ఓట్లను తెచ్చేవి గనుక! ప్రభుత్వమే కాదు, బ్యాంకులతో సహా అన్ని సంస్థల్లో ఇదే ధోరణి. ప్రభుత్వ జి.ఒ.లు అన్నీ ఆంగ్లంలోనే. వాటి గురించి మాట్లాడడం మాత్రమే తెలుగులో! ప్రజావేదికల మీదా చట్టసభల్లోనూ మన రాజకీయ నేతలు తిట్టుకొనేదీ, కొట్టుకొనేదీ తెలుగులోనే! ఆ పని ఆంగ్లంలో చేతగాడు కనుక!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, రెండవసారి ఏర్చడిన ప్రభుత్వాలు తెలుగులో పరిపాలించడాన్ని పూర్తిగా మరిచిపోయాయి. విద్యారంగం సంగతి సరేసరి! ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఆంగ్లాన్ని అతిగా నెత్తిన పెట్టుకొని మోస్తున్న సంగతి అందరకూ తెలిసిందే. ప్రాథమిక విద్యలో తెలుగు విషయంలో అవమానకరమైన ధోరణిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారు. ప్రజలను పూర్తిగా తప్పుదారి పట్టిస్తూ రాజకీయ ప్రయోజనమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ ధోరణిని ప్రదర్శించడం లేదుగాని తెలుగు భాష కోసం పాలనలో గాని, చదువుల్లోగాని వారు చేస్తున్నదేమీలేదు. ప్రజల భాషల విషయంలో కేంద్రప్రభుత్వవిధానాన్ని 'అమ్మనుడిలో ఇటీవల చర్చించుకొంటూనే ఉన్నాం. కొత్తవిద్యావిధానంలో ప్రజాభాషల విషయంలో కేంద్రం సవతి తల్లి ప్రేమనూ, డొల్లతనాన్నీ స్పష్టంగా విమర్శించాం. మొదట్లో కొందరు మా అభిప్రాయాలను తప్పుపట్టారు. కాని, ప్రాచీన భాషల వ్యవస్థల్నీ, భారతీయ భాషల సంస్థనూ కలిపివేసి ఒక విశ్వవిద్యాలయాన్ని పెట్టాలనే కేంద్ర ఆలోచన వెనుక ఉన్న పక్షపాత వైఖరిని, దురుద్దేశాన్నీ బయటపెట్టిన తరువాత, వారు తిరిగి అలోచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భాషోద్యమకారులూ, భొధన, పాలనా రంగాల్లొ ఉన్న తెలుగువారూ తమ బాధ్యతలను గుర్తెరిగి ఉద్యమించాలి. తెలుగుజాతి ప్రయోజనాలనూ, ప్రజాస్వామ్యాన్నీ కాపాడుకోవాలని భావించేవారంతా ఉద్యమించాలి.

తెలుగులో ఏలుబడికి కట్టుబడి ఉంటామని తమ పార్టీ ప్రణాళికలో ప్రకటించని రాజకీయ పార్టీలకు ఓటు వెయ్యవద్దని ప్రకటించాలి. ఫిబ్రవరి 21న జరిగే కార్యక్రమాల్లో ఈ అంశాన్ని ప్రచారంలో పెట్టాలి.

-సామల రమేష్ బాబు. తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2021 |