పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తాతపైన కన్నేసిరి.

ఆపొద్దు మావూర్లా నాగులకు కాయలు కొట్టే పండగ. దీన్ని ఇంతకు ముందర టెంకాయల పండగని, ఈ నడమ వినాయకచవితి అని అంటావుండారు.

ఆదోళ్లంతా తట్టలా పూజ సామాను, అంటిపండ్లు, 'సేపుకాయలు దోసకాయలు, జొన్నెన్నులు ఎత్తుకుని నాగులబాయి తావ వుండే నాగులకి పూజ చేసి నానిన బీము, నూగులు, బెల్లము, కలిపిండే ప్రసాదము అందరికీ ఇస్తా వుండారు. ప్రసాదము తీసుకొనేకి పిల్లన్నతాత కూడా వస్తా వుండాడు.

అది చూసిన ఒక చిన్నోడు “తాతకి ప్రసాదము కావాలంటకా” అని అడిగె. ఆయమ్మ పిడికిలి నిండా పట్టి ఆ చిన్నోని దోసిల్లా పోసె.

అబిటికే వీళ్లు తెచ్చి పెట్టుకాని వుండే జాపాళము విత్తనాల్ని (వేరుశెనగ విత్తనాల్లా వుంటాయి. వీటిని తింటే విపరీతంగా విరేచనాలు అవుతాయి) కలిపి తాతకి ఇచ్చిరి. తాత నగతా తీసుకొని బాగా తిని చేతుల్ని నాకి పెట్టేసె.

ఉడుకు చిన్నోళ్లంతా నగుకాని వెలెసిరే. పిల్లన్న తాతకి బేదులు నిలస్తాలేదంట, సర్కారి ఆసుపత్రిలా అయ్యేలేదనేసి రంటా, బెంగుళూరుకి పోయిండారంట అనే సుద్ది ఊరువూరంతా పాకిపోయె.

“అయ్యో! తాత సావాలనీ మేమిట్ల చేయలే. తమాషాకి చేస్తిమి. తాత బతికి బాగుపడాలా” అని ఉడుకు చిన్నోళ్లంతా దేవునికి మొక్కుకొనిరి.

వీళ్ల మొక్కులు విని ఆ దేవుడే తాతని కాపాడినో, లేదా డాక్టర్లు దేవుళ్లయి తాతని కాపాడిరో కాని పిల్లన్నతాత బతికె. కాని సాకన్న తాత ఎదనెప్పి వచ్చి సచ్చిపాయె.

ఊరువూరంతా సాకన్నతాత ఇంటితావ గుమిగూడి వుండారు. పెద్దోళ్లంతా వచ్చి పీనిగమించ పువ్వుల ఆరాలు వేసి కాళ్లకి దండం పెట్టి పోతావుండారు. సాకన్నతాత సావుసుద్దిన్ని చెప్పేకి ఎవురెవురు ఏయే వూర్లకి పోవాలని గౌడు చెప్పతా బస్సు చార్జీలకి దుడ్లు ఇస్తా వుండాడు.

పొద్దప్పడు ఫొద్దు మునిగింది. సెంద్రుడు చూసినట్లుండాడు. ఆకాశములా గూరాడతా పైపైకి వస్తావుండాడు.

“వీళ్లకి ఎపుడూ వచ్చేది పోయేది ఒగే పంగ (పని). అదే పంగ. వీళ్లకి వేరే పంగ లేదేమో, ఎపుడూ చేసిందే చేస్తారు. కాని మనుషులు అట్ల కాదు. పుట్టినబుటినింకా చచ్చేవరుకు వేరే వేరే పంగలు ఎన్నెనో పాట్లు పడాలా, అయినా మనుషులు ఏమిటికి ఈ పంగ చేసేది. ఆడేమన్నా పంగ లేకుండా ఈడికి వచ్చిరా? లేదా ఈడినింకా ఆడేమన్నా పంగ చేసేకి పోతావుండారా? ఆ పొద్దునింకా ఈపొద్దు కంటా ఎందరో జనాలు అదెందరో జనాలు. అదేమిటికి వచ్చిరో. అదేడకి పోయిరో. వచ్చేది పోయేది. ఇదే పంగ. ఒగే పంగ. ఆ వూరోళ్లది ఈ వూరోళ్లది. ఆ దేశమోళ్లది ఈ దేశమోళ్లది. ఇదే పంగ, ఇదే పంగ. ఏమిటికి వీళ్లకి ఈ పంగ ఏమిటి కోసరము వీళ్లు పంగ చేసేది. ఎందరప్పా! ఇబుటికి ఎందరప్పా.. పాతలెక్క ఎంతని లెక్క తీసేకి అవుతుంది? కొత్తలెక్క కత ఇంతని ఇట్లని కనిపెట్టేకన్నా అవుతుందా? సాములమని, దేవుళ్లమని, కీర్తులు రాసులు పోసుకొన్న వాళ్లంతా పోయిరి. ఏమీ లేనోళ్లూ పోయిరి. ఇంగెవుడు, ఈ పంగ ఏమని చెప్పేది పంగ గుట్టు కనిపెట్టేది ఎవరు, అదెవరో” ఏకనాదము వాయిస్తా ఎర్రన్న ఏమేమో మాట్లాడతా వుండాడు.

రాత్రి తొమ్మిదిగంటల పొద్దు కావస్తుంది. నందిమంగలం, తోటగిరి, పాతకోటల నింకా బజన గుంపోళ్లు వచ్చి బజన సురువు చేసిరి.

"జీవా నీవిది కానవా నువ్వుండే ఇంటి మర్శము ఎరుగావా ౹౹జీ౹౹
తొమ్మిది వాకిండ్ల కొంప దుఃఖములకిది మూలదుంప
ఎంచితే కలగూరగంప - తెలునుకో నీ తాడు తెంపా ౹౹జీ౹౹
డెబ్బదిరెండువేల నాళ్లు అరువది తొమ్మిది కీళ్లు
తోక వురుగులు మూడుపాళ్లు నిండి వున్నది నీచునీళ్లు ౹౹జీ౹౹
మలమూత్రముల కుంట మాంనమునెత్తూరు. పెంట
మురికి పేగుల ముద్దుజంట కూడినది మలకోవి తుంటా ౹౹జీ౹౹

కైవారము నారాయణ తాతగారి తత్వాలు పాడతా వుండారు. కొంతసేపు పాడినంక కొందరు 'టీ ' ఇంకొందరు నీళ్లు తాగి తిరగా పాడేకి సురువు చేసిరి.

“నీవ్లూరు. పేరేమి జీవయ్య నీవు ఎందూకు వస్తివి జీవయ్యా
నీకు బంధువులెవరు జీవయ్య - నీ చందాము ఏమందు జీవయ్యా
అన్నాలుంటేనేమి జీవయ్య బంధు బళగముంటే నేమి జీవయ్యా
పారాడి పారాడి జీవయ్యా నీవు కుంటుచూనున్నావు జీవయ్యా
కర్మబంధనాలు జీవయ్యా నిన్ను కష్టపెట్టునయ్య జీవయ్యా
దుర్మార్గములు విడచి జీవయ్యా నీవు సన్నార్గమున వుండు జీవయ్యా
ఇహములోనా బుట్టి జీవయ్యా గురుని మహిమ కనలేవు జీవయ్యా
పుట్టినందుకు ఏమి జీవయ్యా నీకు పుణ్యఫలమున్నాది జీవయ్యా
మోహపాశములందు జీవయ్యా నీవు మునుగుచున్నావు జీవయ్యా
ఈ మురికిదేహమందు జీవయ్యా నీవు ఎట్లావున్నావు జీవయ్యా
తనువు విడచినీవు జీవయ్యా ఇక ఎందు పోయేవు జీవయ్యా
తనువుతో ఒకమాట జీవయ్య నీవు చెప్పకా పోవలదు జీవయ్యా
నీవున్నా వురమునా జీవయ్యా బేరినాదా మృదంగాము జీవయ్యా

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఈ ఫిబ్రవరి-2021

44