పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఓంకార ప్రణవము జీవయ్యా ఘణఘణ నాదములు జీవయ్యా
నీవెంతో మోసకారి జీవయ్యా ఇకను నమ్మతగదూ నిన్ను జీవయ్యా
సంసారబంధనా జీవయ్యా - నీవు సరిచూడగలేవా జీవయ్యా
నిన్ను నమ్మివుంటి జీవయ్యా నన్ను విడనాడిపోయేవు జీవయ్యా
బ్రహ్మాండపురమునా జీవయ్యా నీవు బయలుదేరవయ్యా జీవయ్యా
రామాకృష్ణార్యులు జీవయ్యా గురిజూపిరి గుట్టెల జీవయ్యా
అంజనేయదాసు జీవయ్యా గురుని మరువడు మనసునా జీవయ్యా”
ఈకిత ఆంజన్నప్ప స్పాముల తత్వము పాడిరి. ఆమీట(తర్వాత)

“కైవారం తాతగారి పాదాలకు గోవింద. సీకనపల్లి ఆంజనప్ప పాదాలకి గోవింద. అరసపల్లి దేవప్ప సామి, లక్కూరు కిష్టసామి, బేరిక బుట్టప్ప సామి. చూడగొండపల్లి రామలింగప్ప సామి, దొడ్డి వెంకటగిరియప్ప సామి పాదాలకి గోవిందా గోవిందా” అంటా గోవిందులు పెట్టిరి.

నేను గోవిందులు పెడతా అదెబుడు కన్ను మూసితినో పొద్దిన కన్ను తీసేతలికి ఇంట్లో వుండా.

తాత సావాసగాళ్లు, సొంతమోళ్లు వూరువూరంతా నిండిపోయి వుండారు. తాత చేసిన మంఛిపనుల గురించి మాట్లాడతా వుండారు.

మనిషి పుట్టేతబుడు ఉసురుతో పుడతాడు. పోయేతబుడు దాన్ని విడచి పోతాడు. నాది నేను అని ఒళ్లుతో తిరగే మనీషి కడకి దాన్ని విడచి పోతాడు. అది తెలుసుకోకుండా ఒకర్ని ఒగరు కొట్టుకొనేది తిట్టుకొనేది. జాతిపేరులా కొందరు, నీతిపేరులా ఇంకొందరు. ఇంకా దేవుడు, దెయ్యమని జనాలని ఏమారిచ్చి (మోసంచేసి) సంపాదిస్తారు. సచ్చేతబుడు ఏ సంపద వస్తుంది. ఏ సొంతమోళ్లు వస్తారు. నిజానికి మనిషి సంపాదించాల్సింది నలుగురు మనుషుల్ని. తను పోతే “పాడి” మోసేకి నలుగురు పోటీ పడతా వస్తే వాడే గొప్పమనిషి అంటా గుర్రన్న గుంపుజనాలకి చెప్పతా వుండాడు.

ఆయప్ప మాటలకి కొందరు తలలు గుంకాయిచ్చి ఏదో గేణము (ఆలోచన) చేస్తా వుండారు. అది గూబగేణమా ఘనమైన గేణమా నాకైతే తెలీలా.

ఇంకొందరు మొకాలు మాడినట్ట సోడ.

మొకాలు పెట్టుకొని నిలచిండారు. రేపు మనకి ఇదేగతి వస్తుందనేమో... మేమూ సావాలనేమో... దిగులనుకొంటా...

“సావంటే నాకు దిగులు లేదు” కిట్టన్న గట్టిగా అనె.

“అది వొచ్చినబుడు తెలుస్తుంది అన్నకి” పిట్టన్న అనె.

“సావు వొచ్చినపుడు మనకి గేణము వుంటే కదా తెలిసేది. ఒళ్లులా సత్తువ పోయి, గేణము పోయినంకే మనము సచ్చేది” శీకలన్న చెప్పె.

“అదీ నిజమే సావు చెప్పి వస్తుందా?” చింతచేసె సొణ్ణప్ప.

సావు సమాచారము మాట్లాడతా చానా జనం వీదంతా నిలచిండారు.

“శివుడు గలడనుచు శిలలకు మొక్కెడి వెర్రి జీవులారా వెతలు విడుడి జీవులందో కాక శిలలనేమున్నది

విశ్వదాభిరామ వినుర వేమ అన్నట్లుగా... సచ్చిపోయిన మారాజు నేరుగా సొర్గానికి పోవాలని తలచి మా రామచంద్రన్న పదిరూపాయలు ఇచ్చి బలే పొగిడించిరప్పో” అంటా పలక వాయిస్తా మోటప్ప ముందర నడస్తా వుంటే పీనిగని ఎత్తుకొని జనం వెనక నడస్తా వుండారు.

వాళ్లవాళ్ల బతుకుల్లా తాత నెనపుల్ని నెమరు వేసుకుంటా...మసాణములా తీసిండే గుంతలా తాతని పెట్టి మన్ను చేసిరి.

ఇందాగంట నేలపైన నడిచిన తాత, ఇబుడు నేల లోపలికి పోయె ఏల? ఏల గుంతలా వేసిరి అంటా గూబగేణము చేస్తిని.

“రేయ్‌! నా గేణము ఏమిటికిరా నీకు, అయినా మనిషి వచ్చిన తావుకే తిరిగి ఫొయ్యేది. దాన్నింకానే ఆ తాతని అట్ల చేసిరా అనె గుడ్లగూబ.

“ఏమి గూబమ్మ, మనిషి గుంతలా నింకా వచ్చెనా, బలే చూసినట్ల చెప్పతావు” అంటిని.

“రేయ్! తిక్కల తిమ్మా, మీ బతుకులు నాకు తెలీదా, మాజాతి బూమిమింద బతికి బట్టకట్టినంకే మీ జాతి పుట్టింది. విష్ణుమూర్తి అవతారాలు నీకి తెలీదేంరా” అనె.

“లేదు” అని తల తిప్పితిని.

“ఇదీ తెలీకుండా, ఇన్నాళ్లు ఈనేల పైన నడచి అదెట్ల బతికి బట్టకడితివిరా అంటా నన్ను ఉమిసె.

“ఈపొద్దు నా జాతకము సరిలే” అని తలగీరుకొంటిని.

“ఏం రా! జాతకము, గీతకము అంటావు. పరక(చీపురు)లా వేస్తా నా బట్టా, మీరు, మీ తోలుబలము, బుద్దిబలముతో బతికేది వదలి పెట్టి గ్రహాలు, నక్షత్రాల పైన పడి ఏడుస్తారేంరా” కోపముగా పరక ఎత్తుకానె.

“అయ్యో! గూబమ్మా నీకు నామీద కోపము వుంటే పరకలా వేయి పర్వాలేదు కాని అలకామాటిల్లా తిట్టద్దే. అందరి మాదిరిగానే నేను, గుంపులా గోవింద అన్నెట్ల నాకు ఈ జుతకము గేణానికి వచ్చె. నన్ను విడువుమా అంటా బేళాడితిని (బతిమిలాడితిని).

“సరే అని గూబమ్మ తన గూట్లోకి వెల్లేసె.

అన్నా. అక్కా... గూబ గేణము, గూబనా బట్ట, గూబ ముండ గూబ గుడ్లదాన్నా అని నోటికొచ్చినట్లు తిట్టేది ఇంగన్నా విడచి పెట్టండ. గూబగేణము ఎంత పెద్ద గేణమని మీకు ఇబుడు తెలిసె కదా.

             XXXXXXX

“అంబపలుకు... జగదాంబ పలుకు” అంటా బుడబుడికి అడిస్తా జోస్యం చెప్పతా ఇంటి ముందర నిలచిండాడు బుడబుడకలాయప్ప.

తలకి ఎర్రతువ్వాలు, తెల్లనిపంచె, నల్లకోటు చేసుకొని చూసేకి బలేగా వుండాడు. అమ్మ ఇచ్చిన తెల్లబట్టను బుజముమింద వేసుకొని బీమును జోళిగిలా పోసుకొని, ఇంగో ఇంటి ముందరికి పోయె. నేను అన్నము తిని అవతలికి వస్తిని.

“గొబ్బియాలో వాగుల్లో గోవులు క్షేమంగుండాల
గొబ్బియాలో వాగుల్ని కాచేది వన్నాశంకరుడే
గొబ్బియాలో గోవుల్ని మేపేది గోపాల సామి
గొబ్బియాలో అమంద ఈమంద మునిమందలాయ”

గొబ్బియాలో పాటలు పాడతా వూర్లాకి వస్తా వుండారు ముగ్గురు ఆడోళ్లు. వాళ్లని చూసి నేను తిరగా అమ్మతావుకి పారితిని.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఈ ఫిబ్రవరి-2021

45