పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నాకళ్లనుండి ఆనందబాష్పాలు జలాజలారాలు పొతున్నాయి. నన్ను హత్తుకొని నెమ్మదింపచేనింది. మనసు కాస్త కుదుటపడింది.

'అయామ్‌ ప్రౌడ్ ఆఫ్‌ యు డాడీ ' అంటున్న శ్రీ విజయ్‌ని ఎత్తుకుని గాల్లో గిరగిరా తిప్పాను. వాడు నవ్వుతుంటే నేనూ ఆనందంతో ఊగిపోయాను.

“అక్కడ రాష్ట్రపతి గారు వచ్చేసుంటారు.” గుర్తుచేసింది లచ్చిమి.

ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపర్వతానికి బయల్లేరాం. ముందుగా రాష్ట్రపతి బస చేసిన అతిథి గృహానికే వెళ్లాం.

ఎదురుగా సోఫాలో రాష్ట్రపతిగారు, ఆయన తమ్ముడు వీరనారాయణగారు కూర్చుని ఉన్నారు. ఎనభై వసంతాలు దాటిన వారి వదనాలు ప్రశాంతంగా కాంతులీనుతున్నాయి. లాల్చీ, పంచకట్టు, కండువా ధరించి తెలుగుదనానికి నిదర్శనంగా ఉన్నారు. సూర్యచంద్రులను పక్కపక్క్మనే చూసినట్టుగా అన్పిస్తోంది.

రాష్ట్రపతిగారు నన్ను చూడగానే.. రా సూర్యా ఎవరూ చేయని ఘనకార్యాన్ని నువ్వు సాధించావ్‌. చాలా గట్టివాడివని నీ గురించే మాట్లాడుకుంటున్నాం”...

'మీరు తలుచుకోకపోతే ఇదంతా జరిగేది కాదు, అంతా మీ ఆశీర్వాదమేనండీ ' ఆయన కాళ్లకి నమస్మరించబోయాను. ఆయన వారిస్తూ నన్ను ఆప్వాయంగా హత్తుకున్నారు.

“సూర్యా నువ్వు నా మనవడిలాంటివాడివి. నీ తెలుగుజాతి ఘనకీర్తి చరిత్ర థీమ్‌ పార్క్‌ చూడగలుగుతానా అనుకొన్నాను. తెలుగుతల్లి ఈ ఘనకార్యాన్ని నా చేతుల మీదుగా జరిగాలని తలపెట్టింది”

'సమయం మించిపోతోంది, వెళదాం పదండి ' వీరనారాయణగారు తొందరపెట్టారు.

మేం బయల్దెరాం. రాష్ట్రపతి కాన్వాయ్‌ ముందుగా సాగుతుంటే మా కారు వారిని అనుసరించింది.

సభాస్థలం దగ్గర జన సందోహం. విదేశాల నుంచి వచ్చిన వారు ఆయా దేశాల వారీగా కూర్చున్నారు. ముందు వరుసలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ వారి మంత్రిగణం. అతిథుల వరుసలో మా కుర్చీలు ఏర్పాటుచేశారు. నేనూ, లచ్చిమి, శ్రీవిజయ్‌ కూర్చున్నాం.

వేదికమీద మాత్రం రెండే ఆసనాలు వేశారు. రెండే ఎందుకో అర్ధం కాలేదు.

భారత ర్యాష్ట్రపతిని సభావేదిక మీదకి ఆహ్వానిస్తూ ప్రకటన చేశారు.

ఎంతో ఉత్సాహంగా వేదికకు చేరుకొని ఆశీనులయ్యారు సూర్యవర్మ, జగమునేలిన తెలుగు గ్రంథకర్త, తెలుగుజాతి ఘనకీర్తి చరిత్ర ధీమ్‌ పార్క్‌ రూపకర్త ను సభావేదికమీదకి ఆహ్వానిస్తున్నాం అని మైకులో పిలుపు వినిపించింది. కరతాళధ్వనుల మధ్య ఎంతో ఆనందంగా వేదికను చేరుకున్నా.

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021

44