Jump to content

పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తీసుకోవటం, ఈ నాటి నీతికి అద్దంపడుతుంది. దుర్గిలో అన్ని ఆలయాలను, శాసనాలు, శిల్పాలను చూచినతరువాత, బుద్దప్రసాద్‌గారితో కలసి నాగార్జున శిల్చశాలను సందర్శించాం. కృష్ణవేణిమాత విగ్రహంగురించి మాట్లాడుకొన్న తరువాత బుద్దప్రసాద్‌గారు దివిసీమకు తిరుగుప్రయాణమైనారు.

నేను మాత్రం ఒప్పిచర్లలోని దేవతలబావిని చూడాలని శ్రీనుతో కలసివెళ్లా. మళ్లీ పల్నాటివీరచరిత్ర గుర్తుకొచ్చింది. కార్యమపూడి యుద్ధరంగంలో పాల్గొనటానికి వచ్చిన నలగాముని సైన్యం విడిదిచేసిన గ్రామాల్లో ఒప్పిచర్ల ఒకటి. ఎప్పుడో, ఎక్కడివాడో, బ్రిటీషు అధికారి రాబర్ట్‌ సివెల్‌ 1872 లో పల్నాడులో కలియదిరిగి ఊరూరాఉన్న చారిత్రక స్థలాలు, కట్టడాలు, శిల్పాలు, శాసనాలను సందర్శించి “లిస్ట్‌ ఆఫ్‌ది యాంటిక్వేరియన్‌ రిమైన్స్‌ ఇన్‌ ది ప్రెసిడెన్సీ ఆఫ్‌ మద్రాస్‌, వా. 1 అనుబంధం 18వ పేజీలో ఒప్పిచర్ల గురించి ప్రస్తావించిన విషయాన్ని గుర్తుచేసుకొంటూ, మన వారసత్వ సంపదపట్ల ఆయనకున్న శ్రద్దకు చేతులెత్తి మొక్కుకున్నా నేనే కాదు ఆంధ్రులంతా కూదా ఆయనకు మొక్కాలి.

ఒప్పిచర్ల(వొప్పిచెర్ల) అనగానే దొనకొండ మల్లయ్య గుర్తుకొస్తాడు. గ్రామానికి 4 కి.మీ.దూరంలో నల్లమల సానువుల్లో భాగమైన కొండపైన శివుడు మల్లయ్యగా అవతరించాడని (స్వయంభువు), కొండమీద నీటిదొనలుండటాన, దొనకొండ మల్లయ్యగా పిలువబడి, ఆ తరువాత థనకొండ మల్లయ్య, థన మల్లయ్యగా స్థిరపడిపోయాడు. స్వామివారు స్వయంగా అవతరించారని పూజారితోపాటు గ్రామస్తులుకూడ నమ్ముతున్నారు. నిజానికి, శివలింగమైనా శిలా శిల్పమైనా శిల్పిచెక్కి ప్రతిస్టించిందేగానీ, దానంతట అది పుట్టిందనుకోవటం మూఢనమ్మకమే.

ఈ ధనమల్లయ్యను దర్శించుకొన్న నాయకురాలు నాగమ్మ క్రీ.శ 1180 ప్రాంతంలో ఆరుబయలు ఉన్న స్వామికి దేవాలయం కట్టించిందని కూడ ఒక కథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు థనకొండ కింద ఉన్న ఊరు, పల్నాటియుద్దం తరువాత, కాకతీయుల కాలంలో, ప్రస్తుత గ్రామమున్న చోటుకు మారింది. బావి దగ్గరకెళ్లి చూశాను. ఆ బావి నిండా చెత్తాచెదారం నిండి, చారిత్రక ఆనవాళ్లు కనిపించటంలేదు. ఆ బావి పక్మనే పశువుల దొడ్జిలో క్రీ.శ. 1299 నాటి కాకతీయ ప్రతాపరుద్రుని అధికారి, మహారాయ గజసాహిణి గుండయనాయకుని శాసనముంది. పల్నాటి నాపరాతిపై చెక్కిన శాసనాక్షరాలు బాగా అరిగిపోయాయి. పరిశీలించిచూస్తే గుండయనాయకుడు, పల్నాడులోని గురిందాల (గురిజాల) - పింగలి స్థలాలను పాలిస్తున్నప్పుడు, వ్రప్పిచెళ్ట (ఒప్పిచర్ల) ప్రజలకు, గోవులకు తాగునీటికోసం, గాడినూతిని తవ్వించి, గాడిని చేసిన కప్పెరసూయ భక్తుని కొడుకు అన్నయభక్తుడు ౩తూముల భూమిని కొలిచి యివ్వగా, ఈ బావి తవ్వటానికి కోమటి తాతయసెట్టి, గొవెరిసెట్టి, మేదినిసెట్టి, రుద్రసెట్టి చెవయలు సహకరించిన వివరాలున్నాయి. ఈ శాసనం బాగా పాతుకు పోయింది. ఇప్పటికి 721 సం॥ల చరిత్రను కన్నతల్లి కడుపులో బిడ్డలా ఈ శాసనం కాపాడుతుంది. మరి అలాంటి శాసనం నిర్ణక్ష్యానికి గురై పశువుల సాహచర్యం చేస్తున్న ఈ శాసన ప్రాముఖ్యతను, ఆస్థలం యజమానికి వివరించి దాన్ని భద్రంగా చూచుకోమని చెప్పడం కంటే నేనేమీ చేయలేకపోయాను.


రాబర్ట్‌ సెవెల్‌ తన నివేదికలో ప్రస్తావించిన ఆర్మియోలజీ సర్వే ఆఫ్‌ సదరన్‌ ఇండియా (మద్రాసు) వారు 1909 లో నకలు తీసిన మరో శాసనంకూడా ఈ దేవతల బావి దగ్గరే ఉందని చెప్పాడు. చుట్టుపక్కల ఎంత గాలించినా కనిపించకపోవటం, నాకు బాధ అనిపించింది. నిర్లక్ష్యం వల్ల ఇలాంటి చారిత్రక ఆనవాళ్లను ఎన్నింటిని పోగొట్టుకొంటున్నామోననిపించింది. చేసేదిలేక దక్షిణ భారత శాసన సంపుటి- 10, పే. 269లో ఉన్న ఈ శాసన పాఠాన్ని పరిశీలిస్తే ఈ శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని గజసాహిణింగారు, గురిండాల-పింగలి

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021

35