పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/18

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నుడుల ఎదుగుదల

జె. డి. ప్రభాకర్‌,8500227185

వాణిజ్యం - స్థానిక నుడులు


ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులను, సేవలను, వినియోగదారులకు చేరువ చేసేందుకు ప్రజల భాషలనే ఉపయోగిస్తున్నాయి. ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలు, సేవా నైపుణ్యాలతో సమానంగా ప్రజల భాషలు వాణిజ్యరంగంలో చోటు చేసుకున్నాయి. కాలానుగుణంగా పెరుగుతున్న పోటీ ప్రపంచంలో వాణిజ్య సంస్థలు తమ రూపాన్ని మార్చుకుంటూ ఉన్నాయి. గతంలో వ్యాపార వాణిజ్య సంస్థలు వస్తూత్పత్తుల మీద మాత్రమే దృష్టి సారించేవి. వినియోగదారులు తమకు కావలసిన ఉత్పత్తులను కొనడానీకి దుకాణాలను ఆశ్రయించేవారు. కొనుగోలుచేసే ఆ వస్తువుల ఉత్పత్తి వివరాలు కూడా ఆ తయారుచేసే పరిశ్రమ నిర్ణయించిన భాషలోనే ఉండేవి. ఎక్కువగా ఇంగ్లీషు భాషలోనే వస్తూత్పత్తి వివరాలు ఆ కాలంలో ఉండేవి. కానీ నేడు ఆధునిక కాలంలో, వస్తువులను వాడుకొనే వినియోగదారుల భాషలో కూడా వస్తువుల ఉత్పత్తి వివరాలు ఉంటున్నాయి. వస్తువుల తయారీ నుంచి వాటి క్రయవిక్రయాల వరకు ఈ మార్చును మనం నేడు చూస్తున్నాం. గతంలో వాణిజ్యరంగం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొనీ మాత్రమే వ్యాపారం చేసేవారు. కానీ వినియోగదారుల సంస్కృతిని వారి భాష నేపథ్యాన్నీ దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తులనూ వాటి విక్రయాలనూ చేస్తున్నారు.

డిజిటల్‌ (సాంఖ్యిక) ప్రకటనలలో ప్రధాన పాత్ర:

వాణిజ్య రంగంలో వస్తూత్పత్తి ఒక ఎత్తయితే వాటిని ప్రజలకు పరిచయం చేసే ప్రకటనలు మరో ఎత్తు. ఆ ప్రకటనలు ప్రజల భాషలోనే ఉంటేనే ఉత్పత్తుల అమ్మకాలు పెరుగుతాయని గ్రహించారు. పరిశ్రమలూ వివిధ వాణిజ్య సంస్థలూ ఈ నిర్ణయానికి రావడానికిగల కారణం నేటి డిజిటల్‌ యుగమే. గూగుల్‌ కెపి జిఎమ్‌ 2017 లో జరిపిన అధ్యయన నివేదిక ప్రకారం, మనదేశంలో 23.4 కోట్ల ప్రజలు అంతర్జాలాన్ని తమ స్థానిక భాషలోనే వినియోగిస్తున్నట్టు, కేవలం 1.75 కోట్ల ప్రజలు మాత్రమే ఇంగ్లీషును ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. అయితే 2021 నాటికి 53.60 కోట్ల ప్రజలు వారి స్థానిక భాషలలో అంతర్జాలాన్ని ఉపయోగిస్తారని తెలిపారు. ఇంగ్లీష్‌ కన్నా స్థానిక భాషల విషయాల్లోనే 75% స్పష్టత ఎక్కువగా ఉందనీ ప్రజలు విశ్వసిస్తున్నారని మరొక అధ్యయనంలో తేలింది. ఈ మార్సులను ఆధారంగా చేసుకుని, ప్రజల అభిరుచులను భావాలను పరిగణనలోకి తీసుకొని వస్తూత్పత్తిదారులూ వ్యాపారులూ వారి తీరు మార్చుకున్నారు.

స్తూల జాతీయ ఉత్పత్తిలో (30౧) మనదేశంలో సేవారంగం ముఖ్య భూమిక పోషిస్తోంది. దినదిన 'ప్రవర్ణమానం చెందుతున్న ఏకైక రంగం ఈ సేవారంగం అని చెప్పొచ్చు. 2017 నాటి స్థూల జాతీయ ఉత్పత్తిలో 61.50 శాతం సేవా రంగం నుండి వస్తోంది. విద్య వైద్యం, రవాణా హోటళ్లు మొదలగు సంస్థలన్నీ ఈ సేవా రంగం క్రిందికి వస్తాయి. ఈ సేవలను ప్రజలకు చేరవేయడానికి భాషే ప్రధానం. ఉదాహరణకు ఒక డాక్టరు రోగుల రోగాన్ని తెలుసుకోవడానికి ఆ రోగులతో మాట్లాడడానికి స్టానిక భాషలే ప్రధానం. అలాగే మిగిలిన సంస్ధలు తమ సేవా వివరాలను వినియోగదారులకు అందించడానికి స్థానికనుడులే ప్రధాన ఆధారంగా నిలుస్తున్నాయి.

స్థానిక భాషల పెట్టుబడితో లాభాలు :

పరిశ్రమలూ, సేవా సంస్థలూ పెట్టే పెట్టుబడులకు అదనంగా ఉత్పత్తుల, సేవా వివరాలకు సంబంధించిన ప్రకటనలకు స్థానిక భాషల పైన పెట్టుబడి పెట్టవలసి వస్తోంది. ఆయా ఉత్పత్తుల, సేవా వివరాలను మూల భాషలో నుండి స్థానిక భాషలోకి అనువదించడానికి అనువాదకులు అవసరమవుతారు. దీని ద్వారా మూల భాషలూ, స్థానిక భాషలూ తెలిసినవారికి ఉద్యోగ పరికల్పన జరుగుతుంది. పరిశ్రమలూ సేవా సంస్థలూ స్థానిక భాషలపై పెట్టే ఈ అదనపు పెట్టుబడి వారి ఉత్పత్తులనూ, 'సేవలనూ ప్రపంచవ్యాప్తంగా భాషా, సంస్కృతి అవరోధాలు లేకుండా ప్రతివారికీ ఉత్పత్తులనూ, 'సేవలనూ విస్తరింపచేయడానికి ఉపయోగపడుతుంది. వినియోగదారులు కూడా ఉత్పత్తి, 'సేవా వివరాలను తమ స్థానిక భాషలో చదువుకోవడానికి సులువుగా ఉంటుంది. దీనితో వస్తువుల, సేవల ఉపయోగం, వినియోగం కూడా పూర్తిగా అవగతమవుతుంది. నేడు ఒక ఉత్పత్తి వివరాలను తెలుగుతోపాటు అనేక భాషల్లో పొందుపరచడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే వస్తువుల, సేవల ప్రకటనలు డిజిటల్‌ (సాంఖ్యీక) మాధ్యమంలో వినియోగదారులను ఆకర్షిస్తాయి. ఫలితంగా వారి మార్కెట్‌ రెట్టింపు అవ్వడానికి అవకాశాలు కూడా ఎక్కువే. ఈ విధంగా నేడు ప్రపంచీకరణ అంతా కూడా స్థానికీకరణ వల్లనే జరుగుతుంది. భాషకు వాణిజ్యాన్ని పెంపొందించే లక్షణాలు కూడా ఉందని గ్రహించిన బహుళజాతీయ సంస్థలు, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ మొదలగు సంస్థలు స్థానిక భాషలపై తమ దృష్టిని నెలకొల్పాయి. సాంకేతిక నిపుణులు కూడా స్థానిక భాషల విలువను తెలుసుకుని కృత్రిమమేథ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ద్వారా భాషల అడ్డుగోడల్ని కూల్చేందుకు సిద్దమవుతున్నాయి. అందువలన పరభాషపై మక్కువ తక్కువ చేసుకుని అమ్మనుడిలోనే ఆదాయం ఉందని గ్రహించాలి.

రచయిత పరిశోధక విద్యార్ధి, "హైదరాబాదు విశ్వవిద్యాలయం,

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021

18