పుట:అమ్మనుడి జనవరి 2021 సంచిక.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రత్యయాలను కలిగి ఉంటాయి. ప్రథమావిభక్తికి -౪ (ప్రత్యయం ఏమీ లేకపోవడం), ద్వితీయావిభక్తికి -ని/ను, షష్టీవిభక్తి -యొక్మ-౭ ప్రత్యయాలు తరచుగా ఉపయోగిస్తారు. అయితే చాలా సందర్భాల్లో ఒకే ప్రత్యయం అనేక విభక్తులను వ్యక్తపరుస్తుంది. ఉదాహరణకు:

1 రవికి జలుబు చేసింది.

2. నేను రవికి పుస్తకం ఇచ్చాను.

పై రెండు వాక్యాల్లో “రవి” నామవాచకానికి “-కు/కి” ప్రత్యయం చేర్చబడింది. కానీ కింది రెండు వాక్యాల్లో వాడిన “-కి/కు” ప్రత్యయానికి వేర్వేరు అర్ధాలు ఉన్నాయి. ఇలాంటి విభక్తి సందిగ్ధత తొలగించేందుకు వాళ్యవిశ్లేషణ చాలా ఉపయోగపడుతుంది.

3.2. ఒకే విభక్తి - అనేక ప్రత్యయాలు

అంతేకాకుండా ఒకే విభక్తి, వేర్వేరు ప్రత్యయాల ద్వారా కూడా వ్యక్తం కావడం భాషలో చాలా తరచుగా జరుగుతుంది. ఉదాహరణకు,

3. నేను రవిని చూశాను

4. నేను సినిమా(9) చూశాను

అనే రెండు వాక్యాలను తీసుకుందాం. మొదటి వాక్యంలో “నేను” అనే పదం “చూశాను” అన్న క్రియాపదానికి కర్తగా వ్యవహరిస్తే “రవిని” అనే పదం వాక్యంలో కర్మగా వ్యవహరిస్తోంది. అలాగే రెండవ వాక్యంలో “నేను కర్తగా వ్యవహరిస్తే “సినిమా” కర్మగా వ్యవహరిస్తోంది. ఈ రెండు వాక్యాలనూ పరిశీలిస్తే మొదటి వాక్యంలో కర్మకు “-ని” అనే ప్రత్యయం చేర్చబడింది. కానీ రెండవ వాక్యంలో కర్మకు “-ని” ప్రత్యయం చేర్చబడలేదు. రెండు వాక్యాల్లో ఒకే రకమైన క్రియను ఉపయోగించినప్పటికీ విభక్తులలో తేడాలు ఉన్నాయి. ఇటువంటి తేడాలు సహజంగా కర్మ యొక్క చేతన (animate) అచేతన (inanimate) లక్షణాల కారణంగా ఏర్పడుతాయి. అయితే వాక్యవిశ్లేషకం ఈ రెండు వాక్యాలను క్రింద బొమ్మల్లో చూపించిన విధంగా విశ్లేషిస్తుంది.

వాక్యవిశ్లేషణని ఇంకొన్ని ఉదాహరణలతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. “నేను రవి-కి/తో ఆ విషయం చెప్పాను” అనే వాక్యంలో "-కి/తొ" ప్రత్యయాలు రెండూ తృతీయా విభక్తిని


పైన గీసిన చెట్ల పటాలను పరిశీలిస్తే “కి” / “తో” ప్రత్యయాలు రెండూ ఒకే సంబంధాన్ని సూచిస్తున్నాయి. కానీ ఉదాహరణకు “రవి కత్తితో మామిడిపండును కోశాడు” అనే వాక్యాన్ని తీసుకుంటే “తో” ప్రత్యయం “కత్తి "తో ఉపయోగించినప్పటికీ “రవితో/కత్తితో” అనే రెండు నామవాచకాలు ఒకే సంబంధాన్ని చూపించడం లేదు. ఇలాంటి వ్యాకరణ సందిగ్ధతలను తీర్చుతూ వాక్యాలను స్వయంచాలకంగా విశ్లేషించడంలో సంగణక విశ్లేషకం పాత్ర ఎంతైనా అవనరం అవుతుంది.

ఈ పత్రంలో కేవలం విశ్లేషకాన్ని పరిచయం చేసే ప్రయత్నం మాత్రమే జరిగింది. అందుకోసం దానికి తగిన చాలా సులువైన వాక్యాలను పైన ఉదాహరణలుగా వివరించడం జరిగింది. అందువల్ల విశ్లేషకానికి సంబంధించిన మరిన్ని ముఖ్యమైన అంశాలను, వివిధ వాక్య నిర్మాణాలను విశ్లేషకం ఎలా విశ్లేషిస్తుందో వివరంగా భవిష్యత్తు పరిశోధనల్లో అధ్యయనం చేసి మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతుంది.

4. యంత్రానువాదంలో వాక్యవిశ్లేషకం యొక్క పాత్ర:

యంత్రానువాదంలో వాక్యవిశ్లేషకం కీలక పాత్ర వహిస్తుంది అనడంలో ఏలాంటి సందేహం లేదు. తెలుగు భాషలోని రచనలను ఇతర భాషలలోకి అనువాదం చేయడంలో తెలుగు వాక్యవిశ్లేషకంచాలా ముఖ్యమైనది. యంత్రానువాదంలో విశ్లేషకం ఒక విభాగంగా చేర్చబడింది. దీని సహాయంతో వాక్య నిర్మాణాన్ని క్షుణ్ణంగా విశ్లేషించి పద సంబంధ సమాచారం సేకరించవచ్చు. అలాంటి సమాచారం ఆ భాష అనువాద ప్రక్రియ జరిగేటప్పుడు చాలా అవసరం అవుతుంది. ముఖ్యంగా, ఒక భాషా కుటుంబం నుండి ఇతర భాషా కుటుంబాలకు అనువదించేటపుడు అందులో తలెత్తే వాక్య నిర్మాణ సందిగ్ధతని (structural ambiguity) తొలగించటంలో వాక్యవిశ్లేషకం చాలా సహాయపడుతుంది. ప్రస్తుత కాలంలో వాక్యవిశ్లేషకాలపై పరిశోధన పోటాపోటీగా సాగుతున్న తరుణంలో, చాలా సాంకేతిక సంస్థలు, భాష శాస్త్రవేత్తలు వీటి నిర్మాణాల్లో నిమగ్నమై ఉన్నారు. యూనివర్సల్‌ డిపెండెన్సీ (uniersal dependency) అనే సంస్థ వారు ముఖ్యమైన ప్రపంచ భాషలన్నింటిలోనూ వాక్యవిశ్లేషకాలను నిర్మించేందుకు టీకాసహిత (annotated corpus) పాఠాలను తయారుచేస్తున్నారు. తెలుగులో 1023 వాక్యాల టీకాసహిత పాఠాలను (annotated corpus) వారి జాలచోటులో (website) పొందుపరచడం జరిగింది.

రచయిత పరిశోధక విద్యార్థి హైదరాబాదు విశ్వవిద్యాలయం,

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జనవరి-2021

17