పుట:అనిరుద్ధచరిత్రము.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నది గాన ద్వారకయందుఁ దద్విద్యాభిలాషఁ బ్రార్థించు విలాసినులకు
దృఢము గావించె సౌరాష్ట్రదేశచంద్ర, వదన లానీలవేణులవలన నేర్చి
రాలతాంగులు దెలుప నంతంత కఖిల, దేశముల సర్వజనవచస్థితిని వెలసె.

104


సీ.

తనకీర్తి చంద్రికాతతి నిండి కృష్ణపక్షంబులు శుక్లపక్షములు సేయఁ
దనదురాజత్వ మింపున సార్వకాలంబునందును గువలయానంద మొసఁగఁ
దనకరంబులు జడత్వమునను భువనప్రజానురాగంబులునై వెలుంగఁ
దనవర్తనంబు మిత్రసమాగమంబున సంపూర్ణకళలచేఁ బెంపు వడయఁ
దనవిలాసం బఖండసౌందర్యమహిమ, నిష్కళంకస్వభావమై నివ్వటిలఁగఁ
జంద్రునకుఁ జంద్రుఁ డనఁదగుసద్గుణముల, చేత ననిరుద్ధుఁడు జగత్ప్రసిద్ధుఁ డయ్యె.

105


వ.

ఇవ్విధంబున నమ్మహానుభావుండైన యనిరుద్ధుండు మహదైశ్యర్యసమృద్ధుండును సక
లభోగానుభవసిద్ధుండును వేదోక్తకర్మానుష్ఠానపరిశుద్ధుండునునై సంసారబద్ధుండు
నుం బోలియుండె నిర్గుణంబును నిశ్చలంబును నిరుపమానందంబును నైన పరబ్రహ్మం బ
ద్వితీయం బయ్యును బహునామరూపంబులఁ బోలుచుఁ జరాచరంబులయందు జీవా
హ్వయుండై పూసలలో దారంబుకైవడిఁ బ్రవర్తించుచుఁ దత్తత్కర్మానుగుణంబులై శరీ
రంబులకు ననుభవంబులగు సుఖాసుఖంబులం బొరయక జపాకుసుమసాంగత్యంబున స్ఫ
టికంబు స్వచ్ఛధవళం బయ్యును మిథ్యారక్తవర్ణం బైనతెఱంగున లిప్తుండునుంబోలె
నజ్ఞుల హృదయంబులకుఁ దోఁచుచుండుననియు జ్ఞానసిద్ధిలేమిం జేసి దేహి కర్మావృతుం
డై తనస్వరూపంబుఁ దాన తెలియనేరక తా నన్యుండని యహంకార మమకారంబు
లం బొంది బద్ధుం డగుననియును నిద్రాకాలంబున స్వప్నలబ్ధం బైనసంచారాదులు
నిద్ర మేల్కనినయప్పుడు మిథ్యలై తెలియంబడినయట్లు జ్ఞానవంతుఁడైన యప్పుడు
తనధావంతంబు నిస్సారంబని యాత్మయందు భేదబుద్ధిలేక సర్వసమత్వంబున సర్వం
బును బ్రహ్మమయంబు ప్రపచం బస్థిరంబని తలంచి బ్రహ్మైవాహంబను వేదాంతసార
వచనార్థంబు కేవలదృఢంబు గావించి యెఱుకగలిగిన పురుషుడు తానై సాయుజ్య
సిద్ధుం డగుననియు నిశ్చయించి యాత్మానుసంధానంబు సేయుచు జనకునికైవడి నాత్మ
జ్ఞానియై సుఖంబు లనుభవించుచుండె నని పలికి మఱియు ని ట్లనియె.

106


శా.

నీలాభంబును వర్తులాకృతియఁ జిహ్నీభూతరాజీవపు
ష్ఠాలంకారము పార్శ్వచక్రము త్రిరేఖాంచన్ముఖోపాంతమై
సాలగ్రామసమాకృతిం బొడమి పూజల్ గాంచి యిచ్చుం గృపా
శీలుండై యనిరుద్ధమూర్తి సకలశ్రీలుం బుధశ్రేణికిన్.

107


క.

ధారుణిలోపల శ్రీమ, న్నారాయణునంశఁ బొడమి నయగుణములఁ బెం
పార ననిరుద్ధనామము, సారంబని తలఁచునతఁడు సౌఖ్యముఁ గాంచున్.

108