పుట:అనిరుద్ధచరిత్రము.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

రమ్మని డాయ౦ బిలిచిన, యమ్మున నమ్ముని నిజాంకమం దునిచి తదీ
యమ్మగు సాముద్రికచి, హ్నమ్ములు దెలియంగఁ జూచి యనిరుద్ధునితోన్.

97


సీ.

భుజనేత్రనాసికంబులు జానుహనువులు నైదుదీర్ఘములు గోప్యాంగకంఠ
జంఘలు మూడుహ్రస్వములు ఫాలము రొమ్ము కటి మూఁడు వెడఁదలు కంఠనినద
మును నాభికందంబు మూడు గంభీరముల్ ఫాలకటిస్కంధబాహుకుక్షి
ముఖములా రున్నతంబులు జత్రుగుల్బత్వగంగుళిచరణంబు లైదు సూక్ష్మ
ములు దృగంతజిహ్వాధరములును నఖక, తాలుకరరేఖ లాఱు రక్తములు నైన
యట్టిమానవుఁ డధికభాగ్యాన్వితుండు, గా నెఱుంగుము కుసుమమార్గణకుమార.

98


సీ.

వరలీల దక్షిణావర్తరేఖాయుతభ్రూమధ్యుఁడు సమస్తభూమి నేలు
నైదురేఖలు ఫాలమం దున్నవాఁడు దీర్ఘాయుస్సమన్వితుండైనవాఁడు
ఊర్ధ్వరేఖలు పాదయుగళంబునందుఁ బెంపొందుమానవుఁ డు త్తమోత్తముడు
తనరి ముప్పదిరెండుదంతము ల్గల్గినయట్టినరుండు భాగ్యాధికుండు
కంబుసన్నిభమైనట్టిగళమువాఁడు, విలసితంబగుకీర్తుల వెలయువాఁడు
కఠినమగుహస్తతలములంఁ గడుమృదుత్వ, చరణములు గల్గు మనుజుఁ డైశ్వర్యయుతుఁడు.

99


గీ.

చారుచరిత సాముద్రికశాస్త్రమందు, నిట్టిలక్షణములు చాల నెన్నఁబడియెఁ
గానఁ బురుషునిఁ గనుఁగొన్నఁ గానవచ్చుఁ, బండితులకు ననాగతభాగ్యగతుల.

100


వ.

శ్రీమన్నారాయణాంశోదయుండైన యివ్వజ్రకుమారుని శరీరంబున నిటువంటి శుభ
లక్షణంబు లనేకంబు లున్నయవి గావున నితండు మహాభాగ్యవంతుండును సకలదిగంత
విశ్రాంతకీర్తివంతుండును విద్యావినయసంపన్నుండును వంశవర్ధనుండునునై కలియు
గాదిమప్రభుత్వసింహాసనారూఢుండై సామంతభూపతులు తనపంపు సేయఁ గృత
యుగలక్షణంబున ధర్మంబు చతుష్పాదపూర్ణప్రవర్తనంబుగా వసుంధరాచక్రం బనే
కసంవత్సరంబు లశాత్రవంబుగాఁ బాలింపంగలవాడును భగవత్స్వరూపుండవు నాది
గర్భేశ్వరుండవు బ్రహ్మజ్ఞాననిధిని నగు నీవలన జన్మించి తనయుం డుత్తమపురుషుం
డగుట స్వాభావికంబ కదా యని పలికినఁ గందర్పనందనుండు మందహాసముఖుండై
మునిపుంగవున కిట్లనియె.

101


క.

మీయాశీర్వచనంబులు, మాయం దనుగతము లగుట మాకున్ సకల
శ్రేయోగుణసంపాద్యము, సేయుటకు నిదానమగుట సిద్ధమ కాదే.

102


క.

అని సాంత్వనవచనంబుల, ననురాగ మొనర్చుచున్న యనిరుద్ధవిభున్
సునయోక్తుల దీవించుచుఁ, జనియె న్నారదుఁడు దివికి జగతీనాథా.

103


సీ.

సరససంగీతంబు సంయుతాసంయుతాహస్తాభినయము భావాభిరామ
వీక్షణభ్రూలతావిభ్రమంబు సపాదతత్కాలకల్పితతాళమాన
మైనలాస్యంబు కాత్యాయనియొద్ద బాణాసురతనయ దా నభ్యసించె