పుట:అనిరుద్ధచరిత్రము.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చుండం దదీయసౌకుమార్యమందహాసమృదువచనసంచరణాదుల కానందంబు వహిం
చుచు నయ్యనిరుద్ధుండు సుఖోన్నతుండై యుండి.

87


మ.

గతగర్వంబునఁ భ్రాంతదేశధరణీకాంతు ల్భజింపంగ ద
ర్పితులై కొందఱుదూరభూవరులు నిర్భీతిం జరింపన్ మహో
న్నతి దండెత్తి జయించి లోఁబఱిచి యాజ్ఞాసిద్ధిఁ గావించెఁ దాఁ
జతురంభోనిధిమధ్యఖండనవకచ్ఛప్పన్నదేశంబులన్.

88


ఉ.

అన్యనృపాలకు ల్స్వవశులై కొనివచ్చి యొసంగువస్తువుల్
కన్నెలు రత్నము ల్హరులు గంధగజంబులు నాది గాఁగ సౌ
జన్యతఁ దెచ్చి తాత కనిశంబును గానుక లిచ్చియాజగ
న్మాన్యునిచేత దీవెనలు మన్నన లందుచునుండి వెండియున్.

89


సీ.

వసుదేవబలదేవవాసుదేవాదులయనుమతి వడసి యత్యంతనియతి
రాజసూయమ్ము తురంగమేధము నాది గాఁగ ననేకయాగములు చేసి
యందు నాహుతు లైనయలపురుహూతాదు లాత్మభాగహవిస్సు లాహరింప
నాజ్యప్లుతంబుగా నన్నభక్ష్యాదులు నవ్వారి గాఁగ సమస్తజనుల
కిడుచు నధ్వర్యముఖ్యుల కెలమి ధేను, భూహిరణ్యరత్నాదులు భూరి గాఁగ
దక్షిణ లొసంగి రాజులఁ దగువిధముల, నంపకము చేసి కీర్తుల నతిశయిల్లె.

90


సీ.

అసమానసాంప్రదాయకశుద్ధిఁ జెలువొందు తండ్రితాతలమహత్త్వంబుఁ జూచి
యష్టదిక్కులయందు నాక్రాంతమైన సత్కీర్తిప్రతాపవిస్ఫూర్తిఁ జూచి
కులరూపగుణములఁ గొనియాడఁగాఁ దగు దేవులయనుగుణస్థితులఁ జూచి
వర్ధిష్ణుఁడై శైశవంపుముద్దులు గుల్కు తనయునియందసందములు చూచి
దానభోగాదులైన సద్వ్రయములందుఁ, బాలుపడియున్న యర్థసంపదలు చూచి
భూప్రజలు వేయునోళ్లను బొగడుచుందు, రెంత ధన్యాత్ముఁ డీయుషాకాంతుఁ డనుచు.

91


వ.

ఆసమయంబున.

92


క.

నారదుఁడు సకలశాస్త్రవి, శారదుఁడు శరీరవిజితశారదవేళా
నీరదుఁడు ముఖనివేశిత, శారదుఁ డేతెంచె దనుజసంహరుకడకున్.

93


క.

వనజాతనయనుఁ బొడగని, వినుతులు గావించి యతని వినయంబులచే
ననుమోదమానసుండై, యనిరుద్ధుం డున్నయెడకు నరిగిన నతఁడున్.

94


గీ.

ఎదురుకొని వందనము చేసి హేమపీఠ, మునను గూర్చుండఁబెట్టిన మునివరేణ్యుఁ
డాదరంబున దీవించి యతనితోడ, నుచితసల్లాపములు సేయుచుండి యుండి.

95


గీ.

ముద్దు గుల్కెడు మరువంపుమొలక యనఁగ, శ్రీలఁ జెలువొందఁగల నెలబాలుఁ డనఁగఁ
గుదుర చక్కనిసింగంపుఁగూన యనఁగ, మీఱు మారుకుమారుఁ గుమారుఁ జూచి.

96