పుట:అనిరుద్ధచరిత్రము.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అనియు నమ్మహాపురుషగుణంబులు గొనియాడి శుకయోగి పరిక్షిన్న్పపాలున కిట్ల
నియె.

109


క.

జననాథ యిట్లు నాచే, వినిపింపఁగఁబడిన రసవివేకవిధానం
బనిరుద్ధచరిత్రము వ్రా, సినఁ జదివిన వినిన నరునిఁ జెందు శుభంబుల్.

110


చ.

అని వివరించిన న్ముదితుఁ డయ్యె ధరావరుఁ డంచు సూతుఁ డిం
పొనరఁగ శౌనకాదులగు యోగివరేణ్యులతోడఁ దెల్పినన్
జనితఘనప్రమోదరససంభృతమానసులై ప్రియంబునన్
వినుతులు చేసి రక్కథకు వేమఱు మత్కృతిరాజ్యనాయకా.

111


క.

ఈయనిరుద్ధచరిత్రము, శ్రేయస్కర మగుచు సుజనజిహ్వాగ్రములన్
బాయక యాచంద్రార్క, స్థాయి యగుచు సుప్రసిద్ధిఁ దనరుం గాతన్.

112


మ.

శయనీభూతభుజంగసంగరజయశ్లాఘానిరాఘాటధై
ర్యయుతోత్తుంగవిహంగపుంగవతురంగారూఢదివ్యాంగపా
దయుగారాధకగోత్రభంగనిగమాంతజ్ఞానశుద్ధాంతరం
గయతివ్రాతముఖాబ్జనూతనపతంగామంగళాధీశ్వరా.

113


క.

క్రేంకారకింకిణీయుత, టంకారజ్యాలతానటచ్చాపజితో
ద్ధుంకారసముఖవీరా, హంకారా సకలభూషణాలంకారా.

114


తోటకవృత్తము.

మన్మథకోటిసమానవిలాసా, సన్ముఖనిర్జితచంద్రవికాసా
చిన్మయరూపవిశిష్టనివాసా, జన్మమయావహసద్గుణభాసా.

115


గద్య.

ఇది శ్రీమంగళాచలనృసింహకృపాప్రసాదసంప్రాప్తవిద్యావైభవ కనుపర్తిరా
యనమంత్రితనూభవ సుజనహితకృత్యని త్యాబ్బయామాత్యప్రణీతంబైన యనిరుద్ధ
చరిత్రం బను మహాప్రబంధఁబునందు సర్వంబును బంచమాశ్వాసము సమాప్తము.