పుట:అనిరుద్ధచరిత్రము.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సంగతి నుంచి త్రిప్పుచును సారెకు మంగళకౌశిక న్జయం
మంగళ మంచుఁ బాడిరి సమంచితపంచమనాదవైఖరిన్.

62


గీ.

నందకాయుధునకు శోభనం బటంచు, నగరకాంతలు నీరాజనంబు లిడుట
కలపతాకహస్తంబుల నభినయించెఁ, బురరమాదేవి భరతవిస్ఫురణఁ దెలసి.

63


క.

నిరుపమవిమానపఙ్క్తులు, గురుతరమణిహర్మ్యములును గూడి వెలుంగన్
సురకాంతలుఁ బురకాంతలు, సరిచల్లెడువిరులవాన జడియై కురిసెన్.

64


వ.

అప్పుడు.

65


సీ.

తాళకేతనసముద్యత్కాంచనాస్యందనారూఢుఁ డైనవాఁ డతనిఁ జూడు
నాగాంతకధ్వజోన్నతహేహేమమయశతాంగారోహణుండైన యతనిఁ జూడు
మకరపతాకాసమానగాంగేయరథాసీనుఁడై యున్నయతనిఁ జూడు
వరఋశ్యకేతు సుందరమైనకనకంపుటరదంబుపై నొప్పునతనిఁ జూడు
మతఁడు బలరాముఁ డతఁడు మురాసురారి, యతఁడు కుసుమాయుధుం డతం డతనితనయుఁ
డనుచు నొండొరులకుఁ దెల్పుకొనుచునుండి, డప్పురంధ్రులు గగనగృహాంతరముల.

66


ఉ.

కైరవిణీప్రియేశువెనుకం జనురోహిణిలీల నింపుసొం
పారఁ బ్రసూనసాయకసుతాసుగతిం జనుదెంచునయ్యుషా
వారిజగంధి నంచితసువర్ణలతాసమమోహనాంగి శృం
గారరసంపుబొమ్మఁ బొడగాంచి పురంధ్రులు సమ్మదమ్మునన్.

67


వ.

తమలో నిట్లనిరి.

68


ఉ.

తేనియ లూరు కెంపుసుదతీమణివాతెర చంపకద్రవం
బానెడితేఁటిగుంపు విమలాంగికచంబు సదా వికాసముల్
బూనుసరోజము ల్చిగురుఁబోఁడికనుంగవ జోక యెప్పుడున్
మాననిచక్రవాకములు మానినిచన్నులు చూడుమా సఖీ.

69


చ.

కలువలపేరు పేరుకొనఁగాఁ గుముదమ్ములు మన్మథాంబకం
బులు గణుతింపఁగా విషమము ల్కమలంబులపుట్టుపూర్వముల్
దెలియఁగఁ బంకజాతములు తేరి కనుంగొనఁగా మెఱుంగుఁదీఁ
గెలు చపలంబులన్నియు సఖీమణికన్నులఁ బోల నేర్చునే.

70


క.

కల దనుచును లే వనుచును, బలుమఱువాదంబు లేల పని లే దింకన్
గల దనుటకు లే దనుటకుఁ, దలపంగా నడుము నడుము తరుణీమణికిన్.

71


మ.

చెలువంబై కళల న్వెలుంగు హురుమంజీదేశపున్ ముత్తియం
బులతోఁ గూర్చిన చేరుచుక్క నొసట న్బొల్పొ౦దు నెమ్మో మహా
చెలి కెంతందము చూడరమ్మ రుచిరాశ్లేషాసమాయుక్తని
ర్మలరాకాతుహినాంశుమండలము సామ్యంబై ప్రకాశించుటన్.

72