పుట:అనిరుద్ధచరిత్రము.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యంబరోపమమధ్యయందంబుగా ఘనసారం బలందంగ జాణవమ్మ
ఘనసారకచ నీవు కంకణాభరణంబు లందగింప వినోదురాలవమ్మ
యనుచుఁ బూర్ణేందువదనలవ్యంగ్యవచన, రచనఁ జిఱునవ్వు మోముల రహి వహింప
వినుతభూషణభూషితాంగునిగఁ జేసి, రపుడు యదువంశజలధితారాధిపతిని.

36


క.

కొందఱు చెలికత్తె లుషా, సుందరిఁ గైచేసి రపుడు సురుచిరభూషా
చందనకుసుమాదులచేఁ, గందర్పునిరాజ్యలక్ష్మిగతిఁ జెలువొందన్.

37


సీ.

గిలుకుటందియలఁ జెక్కినవజ్రములకుఁ బాదసరోజనఖకాంతి తళుకు లిడఁగఁ
బ్రతి లేనిముక్కర సైఁ గెంపులకు ముద్దుమోవి చెంగావిమేల్ముసుఁగు దిద్ద
నిగిడిచేర్చుక్కలో నీలంబులకుఁ గుంతలచ్ఛాయ శృంగాగలక్ష్మి నొసఁగఁ
దాటంకమౌక్తికతతికి మందస్మితరసము లావణ్యవిభ్రమము నించఁ
గటకకేయూరరశనాదికనకమునకు, నమరు మైజిగివన్నియ లతిశయింపఁ
దొడవులకునెల్లఁ దనమేను దొడవు గాఁగ, రహి వహింపుచునుండె నారాజవదన.

38


మ.

కమలాక్షు ల్తగ నవ్వధూవరుల శృంగారించి రత్న ప్రభా
విమలంబైనరథంబుమీఁద నిడి ఠీవి న్వల్లకీవేణుశం
ఖమృదంగాదికవాద్యసంజనితమాంగల్యధ్వను ల్లాస్యకా
సమమంజీరఝళంఝళధ్వనులు హెచ్చన్ రాజమార్గంబునన్.

39


మ.

చనుదేరంగఁ బురంధ్రు లున్నతమహాసౌధంబుల న్నిల్చి హ
స్తనటత్కంకణనిక్వణం బెసఁగ లాజ ల్చల్లి రాత్మావలో
కననీలోత్పలదామసంయుతములై కన్ఫట్టి కాంతిస్ఫుర
ద్ఘననీలోత్సలమాలికాకలితముక్తాజాలలీలం దగన్.

40


చ.

కలికి యొకర్తు వారలను గన్గొనఁబోవుచుఁ గంఠమాలికల్
గళమున వైచుకోకతమకంబున గుబ్బలమీఁదఁ జేర్చినన్
గులికెడు చూచుకంబులఁ దగుల్కొని చూడఁగ నొప్పె నెంతయుం
బొలుపగుతంత్రులం బొలుచు పుత్తడికాయలవీణెకైవడిన్.

41


చ.

అలికులవేణి యొక్కతె సహస్రదళంబు వినోదలీలఁ గో
మలకరపంకజాతమున మాటికిఁ ద్రిప్పుచు నేగుదెంచి యిం
పలరఁగ నవ్వధూవరుల నయ్యడఁ గన్గొనుచుండె వేయుగ
న్నులవలె వీరియందముఁ గనుంగొనఁగా నని తెల్పుకైవడిన్.

42


సీ.

ఈభానుతేజున కీకోకకుచకును జెలిమి సంఘటనంబు చేసినాఁడు
ఈచంద్రవదనున కీచకోరాక్షికి వెలయ నేస్తంబు గావించినాఁడు
ఈమేఘవర్ణున కీకేకిగమనకుఁ గోరి సాంగత్యంబుఁ గూర్చినాఁడు
ఈపద్మహస్తున కీభృంగవేణికిఁ బ్రియవిలాసంబుఁ గల్పించినాఁడు